ఎడపల్లి, అక్టోబర్ 5: మండలంలోని వడ్డేపల్లిలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆన్లైన్ బెట్టింగ్‌కు ఓ కుటుంబం బలైంది. బెట్టింగ్‌లో రూ.లక్షలు పోగొట్టిన కుమారుడితో పాటు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై వంశీకృష్ణారెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రంగణవేణి సురేశ్ (55), హేమలత (48) దంపతుల కుమారుడు హరీశ్ (22) మొన్నటిదాకా నిజామాబాద్‌లో ఉంటూ పెట్రోల్ బంక్‌లో పని చేసేవాడు. ఆర్నెళ్ల క్రితం పని మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు.
సురేశ్ దంపతులు చిన్న కిరాణ షాపు నడుపుతూ వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సొంతిల్లు నిర్మించుకోవాలన్న ఆశతో ఇటీవలే నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే, కుమారుడు హరీశ్ ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి భారీగా అప్పులు చేశాడు. ఇంటి నిర్మాణాన్ని నిలిపివేసిన తల్లిదండ్రులు.. హరీశ్ చేసిన రూ.30 లక్షలకు పైగా అప్పులు కట్టేందుకు తమకున్న 20 గుంటల భూమిని అమ్మేశారు. అయినప్పటికీ కుమారుడిలో కొంచెమైనా మార్పు రాలేదు.
కష్టపడి పనిచేసి గౌరవంగా బతుకుతున్న ఆ కుటుం బం.. నలుగురిలో తిరగలేక మనస్తాపానికి గురైంది. తల్లిదండ్రులతో పాటు కుమారుడు సైతం శుక్రవారం రాత్రి వారు అద్దెకుంటున్న ఇంట్లో ఉరేసుకున్నారు. తెల్లారినా వారు బయటికి రాకపోవడంతో పక్కింటి వారు వెళ్లి పిలిచారు. డోర్ కొట్టినా స్పందన లేకపోవడంతో ఇంటి వెనుక నుంచి చూడగా వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచామిచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ దవాఖానకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.