డిచ్పల్లి, మే 15: డెంగీ.. దోమకాటు ద్వారా మానవులకు సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ వ్యాధితో ఏటా వేలాది మంది మరణిస్తున్నారు. డెంగీ లక్షణాలు వ్యాధిసంక్రమణ తర్వాత మూడు నుంచి 14 రోజుల తర్వాత ప్రారంభమవుతాయి. డెంగీని నియంత్రించేందుకు ప్రభుత్వం ఏటా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ప్రతి సంవత్సరం మే 16న డెంగీ నివారణ దినోత్సవాన్ని చేపడుతున్నది. వానకాలం సీజన్ ప్రారంభమయ్యే క్రమంలో ఈ వ్యాధిపై అవగాహన, చికిత్సకు నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేస్తున్నది.
ఈ సంవత్సరం డెంగీ వ్యాధి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నినాదాన్ని ఎంచుకున్నది. దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకుందాం.. దోమలను తరిమికొడదామనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యింది. నిజామాబాద్ జిల్లాలో డెంగీ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 15 కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ దోమల నివారణ చర్యలు, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తుండడం సత్ఫలితాలను ఇస్తున్నది. ప్రతి శుక్రవారం డ్రైడేను పాటిస్తున్నారు. మురికి కుంటల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమ లార్వా వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోవడంతో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
డెంగీ చికిత్సకు ప్రత్యేకంగా మందులు లేవు. చికిత్సా విధానం పరోక్ష పద్ధతిలో ఉంటుంది. రోగులకు నోటి ద్వారా లేదా రక్తనాళాల ద్వారా ద్రవాలను పంపిస్తారు. అప్పుడప్పుడు ప్లేట్లెట్లను ఎక్కిస్తారు. చాలా కేసుల్లో ప్లేట్లెట్లు 10వేల స్థాయికి పడిపోయినా (1.5-4.5 లక్షలు సాధారణం) లేక తీవ్రమైన రక్తస్రావం ఉన్నా ఇచ్చే సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ లేదా యాంటీ ఆర్హెచ్డీ ఇంజెక్షన్లు మాత్రం ఖరీదైనవి. 95 శాతం మందికి రక్తపోటు, ప్లేట్లెట్లు, హిమోగ్లోబిన్లను గమనిస్తూ ఉండడం, ఇంట్రావీసన్ ఫ్లూయిడ్స్ ఇవ్వడం చేస్తారు. వీటికి ఖర్చు తక్కువే. అవసరం లేకున్నా ప్లేట్లెట్స్ ఎక్కించడం రోగికి నష్టం కలిగిస్తాయి. రక్తపోటు బాగా పడిపోయినా, తీవ్రంగా వాంతులు చేసుకుంటూ నోటి ద్వారా ద్రవాలు తీసుకోవడం కష్టంగా ఉన్నా.. ప్లేట్లెట్ల సంఖ్య 50వేల కన్నా తక్కువ స్థాయికి పడిపోయినా దవాఖానలో చేర్చాల్సి వస్తుంది. జ్వరం తగ్గిన తర్వాత 48 నుంచి 72 గంటలు రోగిని పరిశీలనలో ఉంచి, రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య క్రమంగా 50 వేలకు పెరిగే వరకు దవాఖానలోనే ఉండాలి. ప్లేట్లెట్స్ 30వేల కన్నా తగ్గినా, తీవ్రమైన రక్తస్రావం అవుతున్నా, శరీరంలో ఏదైనా భాగం సరిగా పనిచేయకపోయినా రోగిని ఐసీయూలో చేర్చాల్సి వస్తుంది.
డెంగీ వ్యాధి ప్రమాదకరమైంది. ఈ వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండడం, పారిశుద్ధ్య సమస్యలు లోపించడంతో వాటిలో దోమలు స్థావరాలను ఏర్పరుచుకుంటాయి. ఇవి కుట్టడంతో వ్యాధి వస్తుంది. మంగళవారం జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..
నిజామాబాద్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు నమోదైన డెంగీ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ముదక్పల్లి 1, ఇందల్వాయి 1, బినోలా 1, రెంజల్ 1, మోస్రా 1, అర్సపల్లి 4, మాలపల్లి 3, రాకాసీపేట 1, పాన్గల్లీ 2 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
రక్తపరీక్షలో తక్కువ సంఖ్యలో తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్లు, బ్లడ్స్మియర్ మీద ఎటిపికల్ సెల్స్ ద్వారా నిర్ధారిస్తారు. ఎన్.ఎస్, యాంటిజెన్-యాంటీ డెంగీ యాంటీబాడీలతో రోగనిర్ధారణ చేస్తారు. వ్యాధి ప్రారంభ దశలో ఇవి కనిపించకపోవచ్చు.
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలి. పనికిరాని , వాడుకలో లేని వస్తువులను తొలగించాలి. ఓవర్హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, నీటి తొట్లపై మూతలు పెట్టాలి. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య సిబ్బందికి తెలియజేసి వారి సూచనలు, సలహాలు పాటించాలి. డెంగీ నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– తుకారం రాథోడ్, జిల్లా మలేరియా అధికారి