ఆశాజనకంగా శనగ
నల్లరేగడి భూములు అధికంగా ఉన్న కామారెడ్డి జిలాల్లోని పలు మండలాల్లో యాసంగిలో శనగపంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు. యాసంగి ఆరుతడి పంటల్లో ప్రధానమైన శనగను కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో అధికంగా సాగుచేస్తున్నారు.
- కామారెడ్డి జిల్లాలో 85,492 ఎకరాల్లో సాగు
- పెరిగిన సాగు విస్తీర్ణం
- సంరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడులు
గాంధారి, డిసెంబర్ 11: నల్లరేగడి భూములు అధికంగా ఉన్న కామారెడ్డి జిలాల్లోని పలు మండలాల్లో యాసంగిలో శనగపంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు. యాసంగి ఆరుతడి పంటల్లో ప్రధానమైన శనగను కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో అధికంగా సాగుచేస్తున్నారు. మార్కెట్లో శనగ ఉత్పత్తులకు డిమాండ్ ఉండడంతోపాటు తక్కువ పెట్టుబడి, నీటి వనరులు లేకున్నా పండుతుండడంతో చాలా మంది రైతులు శనగ వైపు దృష్టి సారించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు బాగా కురియడంతో వానకాలంలో సాగు చేసిన సోయా, మక్కజొన్న, మినుము, పెసర వంటి పంటలు కోసిన వెంటనే, తడిగా ఉన్న వ్యవసాయ భూముల్లో రైతులు శనగ విత్తనాలను వేశారు. ఈ సంవత్సరం కామారెడ్డి జిల్లాలో దాదాపు 85వేల ఎకరాల్లో శనగ పంటను సాగుచేస్తున్నారు. శనగ వేసిన తర్వాత భూమిలో తడి ఉంటే చాలు విత్తనం మొలకెత్తుతుంది. అనంతరం వాతావరణంలో ఉండే మంచు, నీటి బిందువులను గ్రహించి పంట ఏపుగా పెరుగుతున్నది. యాసంగిలో సాగు చేయడం సులువుగా ఉండడంతోపాటు ఈ ఏడాది అనుకున్న విధంగా వర్షాలు కురవడంతో చాలా మంది రైతులు శనగ పండించారు. జిల్లాలో నల్లరేగడి భూములు అధికంగా ఉండడంతో యాసంగిలో శనగ పంట సాగు విస్తీర్ణం పెరిగింది.
85,492 ఎకరాల్లో శనగ సాగు..
కామారెడ్డి జిల్లాలో ఈ సంవత్సరం 85,492 ఎకరాల్లో శనగ పంటను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో చాలా మంది రైతులు వానకాలంలో సాగు చేసిన పంట కోతలు కోయగానే యాసంగిలో శనగ పంటను సాగు చేశారు. విత్తనాలు విత్తుకునే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో శనగ పంట సాగుకు భూములు అనుకూలంగా మారాయి. దీంతో నల్లరేగడి భూములు అధికంగా ఉన్న గాంధారి, సదాశివనగర్, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, తాడ్వాయి, పిట్లం, భిక్కనూరు, దోమకొండ, పెద్దకొడప్గల్, ఎల్లారెడ్డి, లింగంపేట్, రాజంపేట్ తదితర మండలాల్లో రైతులు శనగ పంటను సాగు చేస్తున్నారు.
మార్కెట్లో డిమాండ్..
శనగ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. శనగలతోపాటు మార్కెట్లో శనగ పప్పు, శనగ పిండి, పుట్నాలకు గిరాకీ బాగున్నది. దీంతో రైతులు పండించిన శనగ మంచి ధర పలుకుతున్నది. శనగ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు యాసంగిలో సాగు చేసేందుకు ఆసక్తి చూపారు.
రైతన్నల హర్షం..
ఈ సంవత్సరం అనుకున్న విధంగా వర్షాలు కురియడంతోపాటు నల్లరేగడి భూముల్లో నీటిని నిలుపుకొనే సామర్థ్యం ఎక్కువగా ఉండడంతో శనగ పంట ప్రస్తుతం ఏపుగా పెరిగి రిబ్బలు కట్టి, పూత, కాత దశలో ఉన్నది. శనగ పంటకు వాతావరణం అనుకూలించడంతో రైతులు సంతోషపడుతున్నారు. ప్రస్తుతం సాగుభూముల్లో సరైన తేమ ఉండడంతో శనగ పంట ఏపుగా పెరుగుతున్నదని, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అధిక దిగుబడులు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పంట బాగున్నది..
ఈ సంవత్సరం కాలం అనుకూలంగా ఉండడంతో శనగ పంట మంచిగ పండుతున్నది. భూమిలో పదన ఉన్నది. శనగ చెట్లు ఏపుగా పెరిగి పూత, కాత దశలో ఉన్నాయి. మంచి లాభాలు వస్తాయనే నమ్మకం ఉన్నది.
-షాబుద్దీన్, రైతు, గాంధారి
సంరక్షణ చర్యలు చేపట్టాలి..
రైతులు సాగు చేస్తున్న శనగ పంటకు సరైన సమయంలో సంరక్షణ చర్యలు తీసుకుంటే అధికదిగుబడులు వస్తాయి. ప్రస్తుతం శనగ పంట ఏపుగా పెరిగి పూత, కాత దశలో ఉన్నది. శనగపంటపై ఎక్కువగా ఆకుపచ్చపురుగుతోపాటు, పొగాకు లద్దె పురుగు, ఎండు తెగుళ్లు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణ కోసం తొలిదశలో అస్పేట్ లేదా ఇమామెక్టీన్ బెంజోయెట్ మందును ఎకరానికి వంద గ్రాములు చొప్పున పిచికారీ చేయాలి. ఎండు తెగులు నివారణకు ట్రైకోడర్మవిరిడీ అనే మందును ఎకరానికి ఒక కేజీ చొప్పున పిచికారీ చేసుకోవాలి. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ సంరక్షణ చర్యలు తీసుకుంటే శనగ పంటలో అధికదిగుబడులు వస్తాయి.
– నరేశ్, మండల వ్యవసాయాధికారి, గాంధారి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

