జిల్లా కేంద్రం చుట్టూ బైపాస్ రోడ్డుకు ఆనుకొని రెండుచోట్ల చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒకటి మాధవనగర్, మరొకటి అర్సపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. నగరవాసులకు ఈ రెండు వంతెనలు ఎంతో కీలకం కానుండగా.. నిర్మాణ పనుల్లో జాప్యంపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి పనులను త్వరితగతిన పూర్తి చేయించడంలో బీజేపీ, కాంగ్రెస్ పాలకులు శ్రద్ధ చూపించడం లేదు.
మాధవనగర్ వద్ద నిత్యం పదుల సంఖ్యలో రైళ్ల రాకపోకలతో రైల్వే గేటు మాటిమాటికి వేస్తుంటారు. దీంతో ట్రాఫిక్ పది నిమిషాలకోసారి నిలిచిపోవడం, వాహనాలు కిలో మీటర్ల కొద్దీ బారులు తీరడంతో వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇరుకైనా రోడ్డు వెంట వాహనాలు దాటడం గగనంగా మారింది. బైపాస్ మీదుగా ప్రత్యామ్నాయంగా రోడ్డు ఉండడం కాసింత ఉపశమనం ఉన్నప్పటికీ మాధవనగర్ మీదుగా వినాయక్‌నగర్, ఆర్యనగర్, శివాజీనగర్, వర్ని వెళ్లే వారికి ఇక్కట్లు తప్పడం లేదు.
అర్సపల్లి వద్ద ట్రాఫిక్ సమస్య జఠిలంగా తయారైంది. ఇక్కడ గేటు పడితే పావు గంట నుంచి అర గంట వరకూ నిలిచిపోవాల్సిందే. లోడ్‌తో వెళ్లే వాహనాలు రోడ్డు ఎక్కితే చాలు ఎక్కడికక్కడ రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మామిడిపల్లి ఆర్వోబీ పనులను సెప్టెంబర్, 2024 నాటికే పూర్తి చేస్తామని బీజేపీ ఎంపీ అర్వింద్ గతంలో ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ అతీగతీ లేకుండా పోయింది.
కాంగ్రెస్, బీజేపీ పాలకుల నిర్లక్ష్యంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. బీజేపీ ఎంపీ అర్వింద్ పూటకో గడువు నిర్దేశిస్తున్నారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయించడంలో శ్రద్ధను కనబర్చడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. మాధవనగర్, మామిడిపల్లి ఆర్వోబీ పనులు మొదలై ఏండ్లు గడుస్తున్నది. అర్సపల్లి ఆర్వోబీ పనులు ఏడాది క్రితం మొదలవగా, నిర్మాణ పనుల్లో వేగం కనిపించడం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు.
2019, 2024లో రెండు పర్యాయాలు ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీగా అర్వింద్ గెలిచినప్పటికీ తమకు ఒనగూరిందేమీలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్వోబీ నిర్మాణ పనుల్లో వేగం కనిపించింది. మామిడిపల్లి ఆర్వోబీ విషయంలో బీజేపీ ఎంపీ పలుమార్లు గడు వు విధించినా, పనులు మాత్రం నిర్ణీత సమయంలో పూర్తి కాలేదు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వచ్చే వాహనాలను దారి మళ్లించడం కష్టతరంగా మారింది. నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వెళ్లే వాహనాలు సైతం అతి కష్టం మీద రైల్వే పట్టాలను దాటాల్సి వస్తోంది.
బీఆర్ఎస్ హయాంలోనే మాధవనగర్ ఆర్వోబీ పనుల్లో వేగం
జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే దారిలో కీలకమైన మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.63.07 కోట్లు విడుదల చేస్తూ జీవో విడుదల చేయడంతోపాటు పనులను శరవేగంగా చేట్టింది. ఈ ప్రాంతంలో రైల్వే గేటుకు బదులుగా పైవంతెన నిర్మించాలని ఏడేండ్లుగా తెలంగాణ సర్కారు విశ్వ ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా పని చేసిన కవిత సైతం ఆర్వోబీ కోసం తీవ్రంగా శ్రమించారు. మొదట్లో రెండు వరుసల వంతెనకు మాత్రమే రైల్వే శాఖ అనుమతివ్వగా పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని నాలుగు వరుసలో వంతెన నిర్మాణానికి సర్కారు ప్రయత్నాలు చేసింది.
అయితే… కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జాప్యం నెలకొన్నది. కేసీఆర్ సర్కారు ముందుకొచ్చి వంతెన నిర్మాణానికి నిధులు భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయగా రైల్వే శాఖ అంగీకారం చెప్పింది. వాస్తవానికి ఆర్వోబీకి రైల్వే శాఖనే పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించాల్సి ఉన్నప్పటికీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. మొత్తం రూ.93.12 కోట్ల వ్యయంలో తెలంగాణ ప్రభుత్వం రూ.63.07 కోట్లు భరించింది. రైల్వే మంత్రిత్వ శాఖ కేవలం రూ.30.05 కోట్లు మాత్రమే వెచ్చించడం గమనార్హం.రాష్ట్ర సర్కారు వాటాగా నిధులు విడుదల అయినప్పటికీ, పనులు నత్తనడకన సాగుతున్నాయి.
కవిత ముందు చూపుతోనే నాలుగు లైన్లకు మార్పు
ఎంపీగా కవిత ఉన్నప్పుడు మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి వేగంగా అడుగులు పడ్డాయి. పాత ప్రతిపాదనల మేరకు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం రెండు వరుసలకే అనుమతి ఉండగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కవిత ఆలోచన చేశారు. రైల్వే మంత్రిత్వ శాఖతో నాలుగు వరుసల పైవంతెన కోసం అనుమతులు తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఇందుకోసం రోజువారీ వాహనాల రద్దీని శాస్త్రీయంగా గణించి నివేదికలు సమర్పించి రైల్వే శాఖ నుంచి అనుమతులు దక్కించుకున్నారు.
ఆర్వోబీకి అడుగడుగునా కేంద్ర సర్కారు సహాయ నిరాకరణ చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత చొరవ తీసుకుని మెజార్టీ మొత్తంలో ఆర్వోబీ నిర్మాణానికి అయ్యే నిధులను భరించేందుకు ముందుకు వచ్చింది. మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం ఎమ్మెల్సీ కవితతోపాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎంతో శ్రమించారు. ప్రస్తుతం కార్యరూపం దాల్చనున్న నాలుగు లైన్ల ఆర్వోబీ నిర్మాణం మూలంగా నిజామాబాద్ నగర ప్రజలకు భవిష్యత్తులో 30 ఏండ్ల పాటు ఎలాంటి ఇక్కట్లు ఎదురు కాబోవు. పెరిగిన ట్రాఫిక్‌కు రెండు లైన్ల బ్రిడ్జితో కష్టతరంగా మారేది. టీవీయూ 3లక్షలు దాటినందున ప్రస్తుతం మాధవనగర్ వద్ద నాలుగు లైన్ల ఆర్వోబీతోనే మేలు జరగనున్నది.