నిజామాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా అధినేత కేసీఆర్ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాలకు ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్‌చార్జీగా మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌ను కేసీఆర్ నియమించారు. నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఐటీ నిపుణులతో కలిసి తెలంగాణ భవన్లో త్వరలోనే డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు.
డిజిటల్ యాప్‌ను బీఆర్ఎస్ పార్టీ తీసుకు వస్తోంది. ఈ మేరకు తుది మెరుగులు దిద్దుకుంటున్నట్లుగా తెలిసింది. జిల్లా పార్టీ కార్యాలయాల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్చార్జీల ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నారు. శిక్షణ ముగిసిన అనంతరం సభ్యత్వ నమోదుకు తేదీని అధినేత వెల్లడించిన నాటి నుంచి సభ్యత్వాల పునరుద్ధరణ, నూతన సభ్యత్వాల ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని రకాల కమిటీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి కార్యవర్గాల నియామకం చేపట్టనున్నారు.
