సిరికొండ, నవంబర్ 27: వ్యవసాయ కార్మికులకు రూ.12 వేలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు, ఏఐపీకేఎంఎస్ నేతలు బుధవారం సిరికొండ తహసీల్ కార్యాలయాన్ని ముట్టడించారు. వ్యవసాయ కార్మికులను విస్మరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రూ.12 వేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు భారీ ర్యాలీగా వెళ్లి తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల రామకృష్ణ, నాయకులు రమేశ్, దామోదర్, సాయారెడ్డి, కిశోర్, బాలిరెడ్డి, ఎర్రన్న, ఆశీష్, కైలాశ్, బాబన్న, లింబాద్రి, గంగమల్లు, అనీష్ తదితరులు పాల్గొన్నారు.