రెంజల్, డిసెంబర్ 7: మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు మంగళవారం అస్వస్థతకు గురికాగా బుధవారం జిల్లా ఆరోగ్య పర్యవేక్షణ అధికారి డాక్టర్ రాజేశ్, సెక్టోరియల్ అధికారి రామారావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో విద్య.. పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తిన్న ఎస్సీ బాలుర, బీసీ బాలికల హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు పునరావృతం అవుతున్నా ఉపాధ్యాయుల్లో ఎందుకు మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇన్చార్జి ఎంఈవో గణేశ్రావును ప్రశ్నించారు. పాఠశాల పరిసర ప్రాంతాన్ని జీపీ సిబ్బందితో శుభ్రం చేయించాలని, నీరు కలుషితం కాకుండా పైప్‌లైన్ లీకేజీలను పూడ్చివేయాలని సూచించారు.
ఎస్సీ బాలుర, బీసీ బాలికల హాస్టళ్లను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాల్లో సేకరించిన సరుకుల నమునాలను ఐపీఎం ల్యాబ్‌కు పంపిస్తామని జిల్లా ఆరోగ్య పర్యవేక్షణ అధికారి రాజేశ్ తెలిపారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీని తాత్కాలికంగా రద్దు చేశారు. విద్యార్థులను మధ్యాహ్నం భోజనానికి ఆయా హాస్టళ్లకు పంపాలని ఎంఈవోను ఆదేశించారు. రెంజల్ జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతో జిల్లా సెక్టోరియల్ అధికారి రామారావు సమీక్షించారు. ఆయన వెంట రెంజల్ సర్పంచ్ రమేశ్‌కుమార్, ఎంపీడీవో శంకర్, ఇన్చార్జి ఎంఈవో గణేశ్‌రావు, ఆరోగ్య విస్తరణ అధికారులు ఉన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన రెంజల్ జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గంగాధర్‌ను సస్పెండ్ చేస్తూ బుధవారం డీఈవో దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవో కార్యాలయ నుంచి మెయిల్ ద్వారా అందిన సస్పెన్షన్ ఉత్తర్వులను ఎంఈవో గణేశ్‌రావు సదరు ఉపాధ్యాయుడికి అందించారు.
తరుచూ మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటననలకు ఇన్చార్జి ఎంఈవో, హెచ్ఎం, ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తూ మూడోసారి డీఈవో సస్పెన్షన్ వేటు వేశారు. ఈఏడాది ఆగస్టు 30న మధ్యాహ్న భోజనం బాగాలేదని విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేసినా స్పందించకపోవడంతో ఇన్చార్జి ఎంఈవో గణేశ్‌రావు, ఇన్చార్జి హెచ్ఎం గంగాధర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నవంబర్ 18న కూడా మధ్యాహ్న భోజనం సమస్య పునరావృతం కావడంతో ఇన్చార్జి హెచ్ఎం రెహ్మాన్, ఉపాధ్యాయుడు అరుణ్‌ను సస్పెండ్ చేశారు. ఆ ఘటనలు మరువక ముందే మంగళవారం మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా.. ఇందుకు బాధ్యులైన ఉపాధ్యాయుడు గంగాధర్‌ను సస్పెండ్ చేశారు. ఆఘటనలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. వరుసగా ఉపాధ్యాయులు సస్పెండ్ కావడంతో బోధన కుంటుపడుతున్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.