వినాయక్‌నగర్, జూన్ 18: లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డ 20మంది బాలురు సామాజిక సేవ చేయాలని నిజామాబాద్ బాలల మండలి చైర్ పర్సన్ ఖుష్బూ ఉపాధ్యాయ్(ప్రిన్స్ పల్ జూనియర్ సివిల్ జడ్జి) తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా.. పలువురు బాలలు పట్టుబడ్డారు. వారిపై క్రిమినల్ కకేసు నమోదు చేసి, నేర విచారణ అనంతరం బాలల న్యాయ మండలిలో రిపోర్టు ఫైల్ చేశారు.
దీంతో బాలల మండలి చైర్పర్సన్ ఖుష్బూ ఉపాధ్యాయ్ బాలలను కోర్టుకు రప్పించి, 23కేసుల్లో వారిని వేర్వేరుగా విచారించారు. నేరం అంగీకరించడంతో ఒకొక్కరికి జూన్ 23 నుంచి 28వ తేదీ వరకు బాలల పరిశీలక గృహంలో సామాజిక సేవ చేయాలని తీర్పు వెలువరించారు. బాలలు తీర్పు పాటించకుంటే 15రోజులపాటు బాలల పరిశీలక గృహ పర్యవేక్షుని నియంత్రణలో ఉండాలని పేర్కొన్నారు. ఒకేరోజు 23కేసుల్లో తీర్పు వెలువడడం జిల్లా న్యాయ చరిత్రలో ప్రథమమని సీనియర్ న్యాయవాదులు తెలిపారు.