నిజామాబాద్, మే 17, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భారత రాష్ట్ర సమితిలో సభ్యత్వ సందడి మొదలైంది. గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే సన్నాహక సమావేశాల ప్రక్రియ షురూ చేశారు. నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రక్రియకు చకచక అడుగులు పడుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఇన్ఛార్జీగా మాజీ ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌ను కేసీఆర్ నియమించారు.
గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుకు బూత్ స్థాయి ఇన్ఛార్జీల నియామక ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న వేలాది పోలింగ్ బూత్‌లకు ఇద్దరేసి చురుకైన కార్యకర్తలను ఇందుకోసం నియమించారు. ఆ జాబితాను క్రోడీకరించి పార్టీ అధిష్టానానికి వివరాలను పంపించారు. బూత్ స్థాయి తర్వాత మండల స్థాయిలో సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగంగా జరిగేందుకు ఐదుగురు ముఖ్య నాయకులతోనే కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను భారత రాష్ట్ర సమితి సీరియస్‌గా తీసుకుని ముందుకు సాగుతోంది. గతం మాదిరిగానే పెద్ద ఎత్తున సభ్యత్వాల నమోదుకు దూసుకు వెళ్తోంది.
బీఆర్ఎస్ సభ్యత్వాలను ఈసారి కొత్త పంథాలో జరుగుతోంది. గతంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు బుక్కులు పంపించి వాటిలో సభ్యత్వం తీసుకునే కార్యకర్త పేరు, వివరాలను నమోదు చేసేవారు. ఇలా సేకరించిన సమాచారాన్ని కంప్యూటర్లో నిక్షిప్తం చేసి కేంద్ర కార్యాలయానికి పంపించేది. కానిప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కొత్త సదుపాయాన్ని తీసుకు వచ్చారు.
డిజిటల్ రూపంలో సభ్యత్వాలను నమోదుకు బీఆర్ఎస్ నిర్ణయించింది. కార్యకర్త పేరు, చిరునామా వివరాలు నేరుగా ఆన్లైన్లో నమోదు చేసి వారికి రిజిస్ట్రేషన్ నెంబర్‌ను కేటాయిస్తారు. ఈ విధానంలో సభ్యత్వాల నమోదు సులువుగా మారడంతో పాటుగా త్వరగా పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. గతంలో చేపట్టిన సభ్యత్వాల నమోదులో రికార్డు స్థాయిలో జరిగింది. నియోజకవర్గానికి 50వేలు సభ్యత్వాలు తగ్గకుండా చేపట్టారు. ఇప్పుడు అదే స్థాయిలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సారథ్యంలో సమావేశాలు జరుగుతున్నాయి.
స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్. వచ్చిన తెలంగాణను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన ఘనత బీఆర్ఎస్ సర్కార్‌ది. నాడు ఉద్యమంలోనైనా నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాల విషయంలోనైనా రాజీలేని పోరాటంలో గులాబీ పార్టీ ముం దుంటుంది. తెలంగాణకు ఆత్మగా, నీడగా వెన్నం టే ఉంటూ రాష్ర్టానికి వెన్నెముకగా నిలుస్తోంది. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ఉన్నప్పటికీ వాటితో తెలంగాణ రాష్ర్టానికి ఒనగూరే ప్రయోజనం శూన్యం. ఒకరేమో మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేయడానికే పరిమితం అవుతుంటారు. మరొకరు లౌకికం పేరుతో విధ్వేషాలను రెచ్చగొడుతున్నారు. దొందూ దొందే అన్నట్లుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయి.
ఢిల్లీలో కుస్తీ… గల్లీలో దోస్తీ అన్నట్లుగా రాజకీయాలు నెరుపుతూ అనైతిక కార్యకలాపాలతో ఇరు పార్టీల నేతలు స్వప్రయోజనాలకై పాకులాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి వారి కుటుంబాల ఉన్నతికి అధికారాన్ని వాడుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ రాష్ట్రమే శ్వాసగా పోరాటం కొనసాగిస్తోంది. పార్లమెంట్లో రాష్ట్ర ఏర్పాటుపై వెర్రితనంతో అవాకులు చవాకులు పేల్చితే కాంగ్రెస్, బీజేపీలు మోనంగా ఉంటే బీఆర్ఎస్ మాత్రమే బలం లేకున్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా అల్లాడించింది. బీజేపీ ఎంపీ తీరుతో ఆ పార్టీ నేతలంతా తల దించుకోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ అంటే తెలంగాణ… తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా మారింది. ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలను వెంటాడటంలో బీఆర్ఎస్ అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చే ఎన్నికల్లో అద్భుతమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పాటుపడుతోంది.