బోధన్, డిసెంబర్ 19: దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకాలతోపాటు తెలంగాణలో అన్ని మతాల పండుగలకు ఆదరణ లభిస్తోందని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. పట్టణంలోని రవి గార్డెన్లో సోమవారం అధికారికంగా ఏర్పాటు చేసిన క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు కేక్‌కట్ చేసి, క్రిస్టియన్లు, ఫాదర్లకు తినిపించారు. పండుగల ప్రాముఖ్యత తగ్గుతున్న తరుణంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, ముఖ్యంగా సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణ పండుగలకు పూర్వవైభవం వస్తోందని అన్నారు.
అన్ని వర్గాల వారు పండుగల సందర్భంగా సంతోషంగా ఉండేందుకు దుస్తుల పంపిణీతోపాటు పలు రకాలుగా ఆదుకుంటున్నట్లు తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో క్రిస్టియన్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని, బోధన్‌లో క్రిస్టియన్ భవనం నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేయడంతోపాటు పదిహేను రోజుల్లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయిస్తానని హామీ ఇచ్చారు. దళిత క్రిస్టియన్లకు దళితబంధు పథకం ద్వారా లబ్ధ్ది చేకూర్చేలా చర్యలు చేపడతానన్నారు. ఈనెల 25 నుంచి మైనార్టీ రుణాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఏవైనా సమస్యలుంటే బోధన్‌లోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు.
క్రిస్టమస్ పండగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని, అందరికీ ముందస్తు క్రిస్టమస్ శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ కేఎం కిరణ్ కుమార్, సీఐ ప్రేమ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖమర్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్ సోహైల్, బోధన్ తహసీల్దార్ వరప్రసాద్, జడ్పీ వైస్ చైర్పర్సన్ ఎం.రజితాయాదవ్, ఎంపీపీ బుద్దె సావిత్రీ రాజేశ్వర్, బీఆర్ఎస్ బోధన్ పట్టణ, మండల అధ్యక్షులు రవీందర్ యాదవ్, నర్సన్న, కౌన్సిలర్లు కొండ్ర పద్మ, దూప్‌సింగ్, బెంజర్ గంగారాం, మాజీ కౌన్సిలర్ ప్రభావతితోపాటు పాస్టర్ల సంఘం అధ్యక్షుడు అనంతయ్య చౌదరి, వివిధ చర్చిలకు చెందిన పాస్టర్లు, ప్రతినిధులు దారా సందీప్ కుమార్, థామస్, తిమోతీ రాజు, విన్సెంట్, రూబెన్, వివేక్ రాజ్, నేత సాల్మన్ రాజ్, వి. రాజేశ్, నోహ, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు.