బోధన్, నవంబర్ 22: బోధన్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉత్తమ సహకార సంఘం అవార్డు సాధించింది. ఈనెల 21న మత్స్య పారిశ్రామిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ మత్స్య పారిశ్రామిక సంఘాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మత్స్య సహకారశాఖ కమిషనర్ భూక్యా లచ్చీరాం నాయక్ అవార్డులు అందజేశారు. స్థానిక మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం అధ్యక్షుడు కోట అబ్బయ్య, కార్యదర్శి ఎం. గంగాధర్ జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
రాష్ట్రంలోని ఐదు సహకార సంఘాలను ఉత్తమ సహకార సంఘాలుగా ఎంపిక చేయగా ఇందులో బోధన్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఒకటి. సంబంధిత అధికారులు నిర్వహించిన సర్వేల ఆధారంగా బోధన్ ప్రాంతంలోని చెరువుల నిర్వహణ, మత్స్య సంపద, ఆదాయ వనరులు, ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో మత్స్యకారులు సాధించిన ఆర్థికపురోగతి తదితర అంశాల ఆధారంగా ఉత్తమ సహకార సంఘాలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కోట అబ్బయ్య మాట్లాడుతూ తమ పారిశ్రామిక సహకార సంఘానికి ఉత్తమ అవార్డు రావడం సంతోషంగా ఉందని అన్నారు.