డిచ్పల్లి, ఏప్రిల్ 21: యూనివర్సిటీల్లో రెగ్యులర్ ప్రొఫెసర్లతో సమానంగా విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా టీయూలో నిరసన దీక్షలు చేపట్టిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు బాజిరెడ్డి జగన్ సోమవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీల్లో కొన్నేండ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న వారికి న్యాయం చేయకుండా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు జారీ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పున ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని రకాల అర్హతలున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను ముందుగా రెగ్యులర్ చేసి అనంతరం మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పని చేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేసిన విధంగానే వర్సిటీల్లో పని చేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు అండగా ఉంటామన్నారు.