డిచ్పల్లి, నవంబర్ 26 : ఆశ, ఆరోగ్య కార్యకర్తలు మెరుగైన సేవలందించాలని డీఎంహెచ్వో డాక్టర్ సుదర్శనం అన్నారు. డిచ్పల్లి సామాజిక దవాఖానలో అర్బన్, ఇందల్వాయి, సిరికొండ, ముదక్పల్లి, జక్రాన్పల్లి, మాక్లూర్, కల్లెడి, బినోల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేసే ఆరోగ్య, ఆశ కార్యకర్తలకు సమీకృత ప్రాథమిక ఆరోగ్య నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ నిర్వహించారు. మూడు రోజుల పాటు కొనసాగిన శిక్షణ..
శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి డీఎంహెచ్వో హాజరై మాట్లాడారు. వృద్ధాప్యంలో జలుబు, మానసిక రోగులకు అందించే సేవలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అందించే వైద్యసేవలపై వివరించారు. వివిధ దశల్లో వచ్చే మానసిక రుగ్మతలు, టీబీ, హైపర్ టెన్షన్, డయాబెటిక్, క్యాన్సర్ తదితర వ్యాధులు, సంక్రమిత, అసంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పించారు. మాతాశిశు సంరక్షణపై ప్రాజెక్టు అధికారిణి డాక్టర్ అంజన వివరించారు.
ప్రభుత్వ దవాఖాల్లో ఉచిత రక్త పరీక్షలు, ఆరోగ్య పరీక్షలపై గర్భిణులు, బాలింతలకు వివరించాలని, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో రోగులకు వివిధ వ్యాధులు, మానసిక వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పబ్లిక్ హెల్త్ నర్స్ స్వామి సులోచన, మండల ఆరోగ్య విస్తీర్ణాధికారులు వై.శంకర్, ఎం.శంకర్, వెంకట్వ్రి, గోవర్ధన్, రాణి, ఆరోగ్య పర్యవేక్షకురాలు పద్మావతి, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.