రాష్ట్రప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ, క్రీడాకారులకు పెద్దపీట వేస్తున్నది. అందుకు సంబంధించి ఇప్పటికే గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను తయారుచేసే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. గ్రామీణ, పట్టణ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభ, క్రీడాస్ఫూర్తిని వెలికితీసేందుకు రాష్ట్రంలో సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించేందుకు సిద్ధమైంది. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్) సహకారంతో ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో సీఎం క్రీడా కప్ పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది.
ఆటలు ఆడాలనే ఆసక్తి ఉండి అవకాశం లేక సత్తా చాటాలనుకునే గ్రామీణ క్రీడాకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అరుదైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఇప్పటికే గ్రామాల్లో క్రీడలకు పెద్దపీట వేస్తూ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిన సర్కారు తాజాగా క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ కప్-2023 పేరిట పోటీలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలను నిర్వహించనున్నది. ఈనెల 15 నుంచి మండల స్థాయి ఆటల పోటీలు జరుగనుండగా, పాల్గొనాలనుకునే క్రీడాకారులు మండల కమిటీలను సంప్రదించాల్సి ఉంటుంది.
– ఎల్లారెడ్డి రూరల్, మే 8
మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆటల పోటీలు…
ఈ నెల 15వ తేదీ నుంచి 17వరకు మండల స్థాయిలో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్ (పురుషులు), కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నారు. 22 నుంచి 24 వరకు జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్ (పురుషులు), కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్ (పురుషులు), హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్, రెజ్లింగ్ పోటీలను నిర్వహించనున్నారు. 28 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రస్థాయిలో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్ (పురుషులు), కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్(పురుషులు), హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్, రెజ్లింగ్, ఆర్చరీ, జిమ్నాస్టిక్, హాకీ(పురుషులు), లాన్ టెన్నిస్, షూటింగ్, టేబుల్‌టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ (పురుషులు) పోటీలను నిర్వహిస్తారు. ఈ పోటీల్లో 15 నుంచి 36 ఏండ్ల వయస్సు ఉన్నవారు పాల్గొనవచ్చు.
మండల, జిల్లా, రాష్ట్రస్థాయి, క్రీడల పోటీల నిర్వహణకు కమిటీలను ఏర్పాటుచేస్తున్నారు. పోటీల నిర్వహణకు మండల స్థాయిలో రూ.15వేలు, జిల్లాస్థాయిలో రూ.75వేల బడ్జెట్ కేటాయించింది. ఈ నిధులు సరిపోకపోతే స్థానికంగా స్పాన్సర్లను తయారు చేసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని, విజేతలకు మెరిట్ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించారు.
విజేతలకు నగదు ప్రోత్సాహకాలు…
రాష్ట్రస్థాయి పోటీల్లో సర్టిఫికెట్‌తోపాటు వివిధ క్రీడల్లో గెలుపొందే జట్లకు మొదటి బహుమతి రూ.లక్ష, ద్వితీయ బహుమతి రూ.75వేలు, తృతీయ బహుమతి రూ.50వేలు, వ్యక్తిగత క్రీడల్లో ప్రథమ రూ.20వేలు, ద్వితీయ రూ.15వేలు, తృతీయస్థానంలో నిలిచిన వారికి రూ.10వేల నగదు బహుమతులను అందజేయనున్నారు. క్రీడల్లో పాల్గొనాలనుకునే ఆసక్తిఉన్న క్రీడాకారులు మండల కమిటీల వద్ద పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
సీఎం కప్ క్రీడా కమిటీలు..
సీఎం కప్ క్రీడల నిర్వహణకు ప్రభుత్వం మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటుచేస్తుంది. 15 నుంచి మండల స్థాయిలో నిర్వహించేందుకు ఎంపీపీ చైర్మన్‌గా, ఎంపీడీవో కన్వీనర్‌గా, జడ్పీటీసీ, తహసీల్దార్, ఎంఈవో, ఎస్సై, మున్సిపల్ కమిషనర్, పీడీ, పీఈటీలను సభ్యులుగా నియమించారు. జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ/సీపీ వైస్ చైర్మన్‌గా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కో-వైస్ చైర్మన్‌గా, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి కన్వీనర్‌గా, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధి, జిల్లా విద్యాధికారి, జీఎం ఇండస్ట్రీస్, మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా ఉండే కమిటీ ఆధ్వర్యంలో సీఎం కప్ క్రీడలను నిర్వహించనున్నారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 15 నుంచి 36 ఏండ్ల వయస్సు ఉన్న క్రీడాకారులు తమలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం తొలిసారిగా సీఎం కప్ క్రీడలను నిర్వహిస్తుంది. ఈ వయస్సులోపు ఉన్నవారంతా ఆసక్తి ఉన్న క్రీడల్లో మండలస్థాయిలో పాల్గొని ప్రతిభచాటి జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడాల్సిఉంటుంది. అలా ఆడడం ద్వారా రాష్ట్రస్థాయి క్రీడాకారులుగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిభను చూపేందుకు ఇది చక్కని అవకాశం. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– ఎస్. రాజు, జిల్లా క్రీడల ఇన్చార్జి అధికారి
క్రీడాకారులకు అద్భుత అవకాశం….
రాష్ట్రస్థాయి క్రీడాకారుడిగా ఎదగాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అద్భుత అవకాశం సీఎం కప్ క్రీడాపోటీలు. గ్రామీణస్థాయి క్రీడాకారులు తమలోని నైపుణ్యం ప్రదర్శించే అవకాశాన్ని సీఎం కప్ క్రీడలు కల్పిస్తుంది. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందనడానికి ఇది నిదర్శనం. సీఎం కేసీఆర్ ఇంత మంచి నిర్ణయం తీసుకోవడంతో గ్రామీణ క్రీడాకారుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.
– అతిఖుల్లా, ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ, పీఈటీ గండిమాసానిపేట్