గురువారం 28 మే 2020
Nizamabad - Apr 21, 2020 , 02:42:42

నిజామాబాద్‌లో మరో మూడు..

నిజామాబాద్‌లో మరో మూడు..

నిజామాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి/రెంజల్‌/ ముప్కాల్‌: నిజామాబాద్‌ జిల్లాలో సోమవారం మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలో ఒకరికి, మోస్రాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం మొత్తం 105 నమూనాలు పంపగా.. వీటిలో శనివారం 44 నెగెటివ్‌, మిగిలిన 61లో సోమవారం 59 నెగెటివ్‌, మరో రెండు నివేదికలు రావాల్సి ఉందన్నారు. శనివారం పంపిన 64 శాంపిల్స్‌కు గాను 51 నెగెటివ్‌ వచ్చాయన్నారు. మొత్తంగా 15 రిపోర్టుల్లో మూడు పాజిటివ్‌ వచ్చాయని చెప్పారు. మొత్తంగా జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 61కి చేరిందని తెలిపారు. ఈ నెల 18వ తేదీన నిర్మల్‌కు చెందిన ఒక పాజిటివ్‌ పేషెంట్‌ను నిజామాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స కోసం చేర్చుకున్నారని, అతడు సోమవారం గాంధీకి తరలిస్తుంటే చనిపోయాడన్నారు. ఆ మృతదేహాన్ని, అతని ప్రైమరీ కాంటాక్ట్స్‌ను నిర్మల్‌ జిల్లా యంత్రాంగానికి అప్పగించామని తెలిపారు. ఈ కేసు నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించింది కాదని పేర్కొన్నారు.

కరోనా నియంత్రణకు చర్యలు కట్టుదిట్టం..

ఢిల్లీ మర్కజ్‌ కేసుల మూలాలు జిల్లాలో బయట పడిన మరుక్షణం నుంచీ జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 777 శాంపిళ్లను పరీక్షల కోసం పంపారు. ఇందులో 550 మందికి నెగెటివ్‌, 61 మందికి పాజిటివ్‌ వచ్చింది. పాజిటివ్‌ వచ్చిన 61 మందిలో 38 మంది మర్కజ్‌ నుంచి వచ్చిన వారు కాగా.. 22 మందికి ప్రైమరీ కాంటాక్ట్‌ ద్వారా కరోనా సోకింది. విదేశాల నుంచి తిరిగొచ్చిన వారిలో ఒకరికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. సెకండరీ కాంటాక్ట్స్‌ కింద ముగ్గురికి పాజిటివ్‌ నమోదైంది. విదేశాల నుంచి 3,494 మంది జిల్లాకు తిరిగొచ్చారు. మరో 1,537 మంది, ఇతర రాష్ర్టాలు, ప్రాంతాల నుంచి తిరిగొచ్చిన 294 మంది వారిని హోం క్వారంటైన్‌ చేశారు. ఢిల్లీ మర్కజ్‌ నుంచి జిల్లాకు 63 మంది తిరిగొచ్చారు. వీరి నుంచి 344 మంది ప్రైమరీ కాంటాక్ట్స్‌ కలిగి ఉన్నారని జిల్లా యంత్రాంగం గుర్తించింది. 569 మంది సెకండరీ కాంటాక్ట్స్‌గా ఉన్నట్లు గుర్తించారు. రెంజల్‌ మండలం కందకుర్తిలో 46 మందికి, బాల్కొండ, ముప్కాల్‌, మెండోరా మండలాలకు చెందిన 20 మందికి కరోనా నెగెటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.


logo