శనివారం 30 మే 2020
Nizamabad - Mar 30, 2020 , 01:36:48

మరింత కట్టుదిట్టం..

మరింత కట్టుదిట్టం..

  • లాక్‌డౌన్‌ పొడగింపుతో చర్యలు ముమ్మరం
  • ఏప్రిల్‌ 14 వరకు కట్టుదిట్టమైన చర్యలు
  • రేషన్‌ దుకాణాలకు 10,500 మెట్రిక్‌ టన్నుల బియ్యం
  • ఉచిత బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి
  • రేషన్‌ దుకాణాల వద్ద శానిటైజర్లు, ఇతరత్రా సౌకర్యాలు
  • అమాంతం పెరిగిన చికెన్‌ వినియోగం, ధరలు పెంచిన వ్యాపారులు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కీలకమైన నిర్ణయాలపై జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న ది. మార్చి 31 నాటికి ముగియాల్సిన లాక్‌డౌన్‌ ను ఏప్రిల్‌ 14 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. గడిచిన ఎనిమిది రోజులుగా సాగిన లాక్‌డౌన్‌ పరిస్థితులతో పాటు కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడి చేయాలనే ఉద్దేశంతో కఠిన నిర్ణయాలకు అధికారులు సిద్ధం అవుతున్నారు. రోజురోజుకూ కరోనా వ్యాధి అనుమానితులు వెలుగు చూస్తుండడంతో ప్లాన్‌ -1, ప్లాన్‌- 2, ప్లాన్‌- 3 ప్రకారం ఐసోలేషన్‌ వార్డులను అందుబాటులోకి తెచ్చేందుకు కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ ఏర్పాట్లు చే స్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో పాజిటివ్‌ కేసు నమోదుతో కామారెడ్డి యంత్రాంగం అప్రమత్తమైంది. ఢిల్లీ ప్రార్థన మందిరంలో పలువురిని కలిసిన వారు జిల్లాలోనూ ఉండడంతో వారందరినీ అధికారులు గుర్తించారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌...

కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న ముం దస్తు జాగ్రత్త చర్యల్లో ఇంటింటి సర్వే ఎంతో కీలకమైంది. పట్టణాల్లో, గ్రామాల్లో ఎవరైనా విదేశాల నుంచి వచ్చి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఉంటే వారిని గుర్తించడమే ప్రధాన లక్ష్యంగా ప్రత్యేక బృందాలు జిల్లాలో పని చేస్తున్నాయి. మరోవైపు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం ఫోన్‌ నెంబర్లను ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో రోడ్లపై పోకిరీలు అనవసరంగా తిరిగినా, రద్దీ ఉన్నా సమాచారం చేరవేయాలని అధికారులు కోరుతున్నారు. కరోనా లక్షణాలు కలిగిన వారు ఉంటే నేరుగా ఫోన్‌ చేసి చెప్పొచ్చని చెబుతున్నారు. 1468, 73829-28649, 73829-29350 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్‌, ఎస్పీ కోరుతున్నారు. పది రోజుల క్రితం నుంచే అందుబాటులోకి వచ్చిన కంట్రోల్‌ రూంకు రోజు రోజుకూ ప్రజల నుంచి కాల్స్‌ పెరుగుతున్నట్లుగా నోడల్‌ అధికారి, సీపీవో శ్రీనివాస్‌ తెలిపారు. పోలీస్‌, రెవెన్యూ, వైద్యారోగ్య శాఖల నుంచి ఉన్నతాధికారులు స్వయంగా ప్రజల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ పర్యవేక్షిస్తున్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారు 1,271 మంది...

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మార్చి 1వ తారీఖు నుంచి వివిధ దేశాల నుంచి వచ్చిన వారిని ప్రత్యే క బృందాలు గుర్తించే పనిలో నిమగ్నం అయ్యా యి. వీరి సంఖ్య రోజువారీగా పెరుగుతున్నది. జిల్లా మొత్తం 1,271 మంది వివిధ దేశాల నుంచి రాగా వారందరికీ వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే జిల్లా కేంద్ర దవాఖానకు అక్కడి నుంచి గాంధీ   దవాఖానకు పంపుతున్నారు. కామారెడ్డి రెవె న్యూ డివిజన్‌ పరిధిలో అత్యధికంగా 1010 మం ది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. రోజువారీగా వీరికి వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు అందిస్తున్నారు.  కలెక్టర్‌ ఎ.శరత్‌ సైతం హోం క్వారంటైన్‌లో ఉన్న వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

కొండెక్కిన చికెన్‌ ధరలు...

మొన్నటి వరకు వినియోగదారుల ఆదరణ కోల్పోయిన చికెన్‌ ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కొండెక్కి కూర్చుంది. కరోనా వైరస్‌తో తీవ్రంగా దెబ్బతిన్న పౌల్ట్రీ రంగం ఇప్పుడు కుదుట పడుతున్నది. ఆదివారం ప్రజలంతా మాంసం కొనుగోళ్లకు ఆ సక్తి చూపారు. ముఖ్యంగా మటన్‌, చికెన్‌ తీసుకునేందుకు దుకాణాల వద్ద బారులు తీరారు. సామాజిక దూరంలో భాగంగా ఒక్కో చికెన్‌ షాపు వద్ద అర కిలో మీటరు మేర క్యూలైన్లు దర్శనం ఇచ్చాయి. మొన్నటి వరకు రూ.30కే కిలో చికెన్‌ అమ్మిన వ్యాపారులే నేడు రూ.160కి కిలో చికెన్‌ విక్రయించారు. ధరలు అమాంతం పెరిగినప్పటికీ వినియోగదారులు మాత్రం మాంసం రుచి చూసేందుకే ఇష్టపడ్డారు. కరోనా వైరస్‌ మహమ్మారితో అతలాకుతలమైన పౌల్ట్రీ రంగంలో ప్రస్తుతం బాయిలర్‌ కోళ్లు అందుబాటులో లేవు. డిమాండ్‌కు తగ్గట్టు కోళ్లు లేకపోవడంతో ధరలు పెరిగినట్లుగా అర్థమవుతున్నది.

రేషన్‌ దుకాణాలకు చేరిన బియ్యం

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభించడంతో అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్‌తో అనేక మంది ప్రజలకు తిండి తిప్పలకు ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగా రేషన్‌ కార్డుదారులకు 12కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కామారెడ్డి జిల్లాలో 2,43,000 రేషన్‌ కార్డుదారులుండగా వీరి కోసం 577 రేషన్‌ దుకాణాలకు 10వేల 500 మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలు జిల్లాకు చేరుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పకడ్బందీ జాగ్రత్తలతో పంపిణీ చేయనున్నాం. రేషన్‌ కార్డు కలిగిన కుటుంబానికి రూ.1500 ఇచ్చేందుకు సైతం ఏర్పాట్లు చేస్తున్నాం. 

- కొండల్‌ రావు, పౌరసరఫరాల అధికారి, కామారెడ్డిlogo