ఇందూరు/కోటగిరి/రుద్రూర్/ఆర్మూర్/రెంజల్, ఆగస్టు 9 : శ్రావణ మాసాన్ని పురస్కరిచుకొని ఆలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని నీలకంఠేశ్వరాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని ఈవో వేణు తెలిపారు. కోటగిరి మండలం కారేగాం మహదేవ్ గుట్టపై ఉన్న శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసంలో ప్రతి సోమవారం భక్తులకు అన్నదానం చేస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
రుద్రూర్ మండలంలోని గైని గుట్టల బసవేశ్వరాలయంలో భక్తులు ప్రత్యేక పూజలతోపాటు సత్యనారాయణస్వామి వ్రతాలను ఆచరించారు. మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
సిద్ధులగుట్టపై శ్రావణ సందడి
ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై శివాలయంలో అర్చకుడు కుమారశర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే దత్తాత్రేయ, రామాలయం, దుర్గామాత, అయ్యప్ప ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు సుమన్, గంగాకిషన్, మీనాచందు, గంగారెడ్డి, ఆనంద్ పాల్గొన్నారు.రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామం ఉన్న రామాలయంలో సోమవారం హోమం నిర్వహించారు. శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా హనుమాన్, శ్రీధర్ మహరాజ్ విగ్రహాల జీర్ణోద్ధారణ, పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా హోమం నిర్వహించామని వేద పండితుడు శంకర్ మహరాజ్ తెలిపారు. కార్యక్రమంలో శ్రీధర్ మహరాజ్ వంశస్తులు ఆనంద్‌కుమార్, యోగేశ్ తదితరులు పాల్గొన్నారు.