TG Lawcet 2025 | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. అదే రోజు ఫైనల్ కీతోపాటు, ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు విడుదల చేయనున్నారు. లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలను శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వుడిత్యాల బాలకిష్టారెడ్డి, వైస్చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌లు పాల్గొని పేపర్ కోడ్‌ను ఎంపికచేశారు.
79.02శాతం హాజరు..
మొత్తం మూడు సెషన్లల్లో 76 పరీక్షాకేంద్రాల్లో పరీక్షలను నిర్వహించగా 79.02శాతం అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. ఉదయం సెషన్లో 20,719 మందికి, 16,109 (77.75శాతం), రెండో సెషన్లో 20, 491 మందికి 16,009 (78.13శాతం), మూడో సెషన్లో 16,505 మందికి 13,491 (81.74శాతం) అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్షీ తెలిపారు.
10న ప్రాథమిక కీ విడుదల..
లాసెట్, పీజీ లాసెట్ ప్రాథమిక కీని ఈ నెల 10న తేదీన విడుదల చేస్తారు. కీ కోసం https:/lawcet.tgche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. అభ్యర్థులు ఈ నెల 14వ తేదీలోపు ప్రాథమిక కీపై అభ్యంతరాలు వ్యక్తంచేయవచ్చు. ఈ నెల 25న ఫలితాలు విడుదల చేస్తారు.