Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీల్లో పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించిన పరీక్షను శుక్రవారం నుంచి నిర్వహించనున్నట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
పీహెచ్డీ ప్రవేశ పరీక్షలను మూడు రోజుల పాటు మూడు సెషన్లలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షల కోసం మొత్తం 9,747 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. కంప్యూటర్ బేస్డ్గా నిర్వహిస్తున్న ఈ పరీక్షకు కేంద్రాలను హైదరాబాద్ నగరంలోనే ఏర్పాటు చేశామని వివరించారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రానికి పరీక్ష ప్రారంభమయ్యే 90 నిమిషాల ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు తమ వెబ్సైట్లో చూసుకోవాలని స్పష్టం చేశారు.
6వ తేదీ నుంచి బీసీఏ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ రెండు, ఆరో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల ఆరవ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ లో చూసుకోవాలని సూచించారు.
ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా తేదీల ఖరారు
ఎంఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (ఇంటలెక్చువల్ డిసేబిలిటీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 2వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఎంఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ ఫీజును వచ్చే నెల 2వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. రూ. 200 అపరాధ రుసుముతో 5వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఓయూ వెబ్సైట్ లో చూసుకోవాలని సూచించారు.
బీ ఫార్మసీ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం
బీ ఫార్మసీ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్ కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీ ఫార్మసీ (పీసీఐ) మ మెయిన్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. విద్యార్థులు తమ మార్కు మెమోలను సంబంధిత కళాశాల నుంచి మూడు వారాల తర్వాత పొందవచ్చని చెప్పారు. ఈ రివాల్యుయేషన్ కు ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈ నెల 28వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ. 200 అపరాధ రుసుముతో ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పరీక్ష జవాబు పత్రాల నకలు పొందగోరేందుకు ఒక్కో పేపర్ కు రూ.1000 చొప్పున చెల్లించి ఈ నెల 28వ తేదీ వరకు తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.