BE Revaluation | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ ఏఐసీటీఈ ఎనిమిదో సెమిస్టర్ మెయిన్, బ్యాక్ లాగ్, బీఈ (సీబీసీఎస్), బీఈ (నాన్ సీబీసీఎస్) కోర్సుల ఎనిమిదో సెమిస్టర్ వన్ టైం ఛాన్స్, బ్యాక్ లాగ్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని, ఫలితాలను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
విద్యార్థులు తమ మార్కు మెమోలను సంబంధిత కళాశాల నుంచి రెండు వారాల తర్వాత పొందవచ్చని శశికాంత్ తెలిపారు. ఈ ఫలితాల రివాల్యుయేషన్కు ఒక్కో పేపర్ కు రూ.800 చొప్పున చెల్లించి ఈ నెల 19వ తేదీలోగా, రూ.200 అపరాధ రుసుముతో 22వ తేదీ వరకు టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జవాబు పత్రాల నకలు పొందగోరువారు ఒక్కో పేపర్ కు రూ. 1000 చొప్పున చెల్లించి ఈ నెల 22వ తేదీ వరకు తమ కార్యాలయంలో చెల్లించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.