శాస్త్రవేత్త కావాలనుకుంటున్నారా? సైన్స్ పరిశోధనే కెరీర్‌గా ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారా? ఇంజినీరింగ్, మెడిసిన్లకు భిన్నంగా జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో చదవాలనుకుంటున్నారా? అయితే కింది వివరాలు మీ కోసమే. జాతీయస్థాయిలో నిర్వహించే నెస్ట్ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రస్తుతం నెస్ట్ ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా..
నెస్ట్ (నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్)
జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా 2022-27 విద్యాసంవత్సరంలో బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో పీజీ కోర్సు- ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ (ఐదేండ్లు) ప్రవేశాలు కల్పిస్తారు. భువనేశ్వర్‌లోని నైసర్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్), యూనివర్సిటీ ఆఫ్ ముంబైలోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్)లో ప్రవేశాలు కల్పిస్తారు. నైసర్ హోమిభాభా నేషనల్ ఇన్స్టిట్యూట్ (హెచ్బీఎన్ఐ) ఆఫ్ క్యాంపస్ సెంటర్.
అర్హతలు
ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీల నుంచి 2020, 2021 సంవత్సరాల్లో ఇంటర్ (సైన్స్) గ్రూప్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 2022లో ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోట్: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.
వయస్సు: జనరల్, ఓబీసీ విద్యార్థులు 2002, ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదేండ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
నైసర్, సీఈబీఎస్‌లో ప్రవేశాలు పొందాలంటే నెస్ట్-2022 పరీక్ష తప్పనిసరిగా రాయాలి.
ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో రెండు సెషన్లలో నిర్వహిస్తారు.
పరీక్షలో బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
ఈ పరీక్షలో అభ్యర్థికి ఆయా సబ్జెక్టుల్లో ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.
నోట్: నాలుగు సెక్షన్లలో సాధించిన మార్కుల ఆధారంగా ఎక్కువ మార్కులు వచ్చిన మూడు సెక్షన్లను పరిగణలోకి తీసుకుని రెండు ఇన్స్టిట్యూట్లు మెరిట్ లిస్ట్‌ను విడివిడిగా తయారు చేస్తాయి.
స్కాలర్షిప్
ఈ సంస్థల్లో సీటు వచ్చిన విద్యార్థులకు దిశ ప్రోగ్రామ్ కింద ఐదేండ్లపాటు ఏడాదికి రూ.60,000 చొప్పున స్కాలర్షిప్ ఇస్తారు. అలాగే వేసవి ప్రాజెక్టు కోసం ఏడాదికి రూ.20,000 అదనంగా ఇస్తారు. ఇన్స్పైర్ స్కాలర్షిప్ కూడా ఉంటుంది. అన్ని సెమిస్టర్లలోనూ మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) ట్రెయినింగ్ స్కూల్లో పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
ప్రత్యేకతలు
ఈ రెండు సంస్థలు రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్లు
ఈ సంస్థల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులతోపాటు విదేశీ శాస్త్రవేత్తలు బోధిస్తారు. అధునాతన ప్రయోగశాలలు ఉన్నాయి.
పూర్తిస్థాయిలో ల్యాబొరేటరీలు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి.
నైసర్‌లో 200, సీఈబీఎస్‌లో 57 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 18
పరీక్ష తేదీ: జూన్ 18
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
వెబ్సైట్: https://nestexam.in