IBPS Clerk: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న వారికి గుడ్‌న్యూస్. 10 వేలకుపైగా పోస్టులతో ఐబీపీఎస్ (Institute of Banking Personnel Selection) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 10,277 క్లర్క్ పోస్టుల భర్తీకి (IBPS Clerk) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (CRP)-కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA)-XV ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఆసక్తి, అర్హత కలిగినవారు అధికారిక వెబ్సైట్ www.ibps.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్) ఎంపిక పరీక్ష ఉంటుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నది. తెలంగాణలో 261 పోస్టులు (ఎస్సీ-43, ఎస్టీ-20, ఓబీసీ-56, ఈడబ్ల్యూఎస్-23, జనరల్-119) ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 367 ఖాళీలు (ఎస్సీ-61, ఎస్టీ-28, ఓబీసీ-84, ఈడబ్ల్యూఎస్-35, జనరల్-159) ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1315, కర్ణాటకలో 1170, మహారాష్ట్రలో 1117 పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు కనీస వయస్సు 20 ఏండ్లు, గరిష్టంగా 28 ఏండ్లు ఉండాలి. అంటే అభ్యర్థి 1997, జూలై 2 తర్వాత, 2005, జూలై 1వ తేదీ లోపు జన్మించి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. సంబంధిత సబ్జెక్ట్‌ను హైస్కూల్ లేదా డిగ్రీలో చదివి లేదా కంప్యూటర్ కోర్సు (సర్టిఫికేట్/డిప్లొమా) పూర్తిచేసి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.175 కాగా, ఇతరులు రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 21 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా (CBT) ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష రాయాలి. అందులో అర్హత సాధించిన వారికి మెయిన్ పరీక్ష ఉంటుంది. మెయిన్ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. అయితే ఈ ఏడాది కొత్తగా లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ LLPT ని (స్థానిక భాషలో ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు) ప్రవేశపెట్టారు. మెయిన్స్‌లో అర్హత సాధించి, ఉద్యోగానికి ఎంపికైనవారికి ఈ పరీక్ష ఉంటుంది. దీనిని తప్పనిసరిగా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైనవారిని ఉద్యోగానికి ఎంపికచేయరు. కాగా, ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో జరుగుతుంది. ఫలితాలను అక్టోబర్ లేదా నవంబర్ విడుదల చేస్తారు. మెయిన్ పరీక్షను నవంబర్ 29న నిర్వహిస్తారు. వచ్చే ఏడాది (2026) మార్చిలో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇస్తారు.
ప్రిలిమినరీ.. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నలు అడుగుతారు. 60 నిమిషాల్లో (గంట) పూర్తిచేయాల్సి ఉంటుంది.
ఇంగ్లిష్- 30 ప్రశ్నలు, 30 మార్కులు
న్యూమరికల్ ఎబిలిటీ- 35 ప్రశ్నలు, 35 మార్కులు
రీజనింగ్ ఎబిలిటీ- 35 ప్రశ్నలు, 35 మార్కులు
ప్రతి విభాగానికి 20 నిమిషాల చొప్పున సమయం ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
మెయిన్స్.. 200 మార్కులకు ఉంటుంది. మొత్తం 155 ప్రశ్నలు అడుగుతారు. 120 నిమిషాల సమయం ఇస్తారు.
జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్- 40 ప్రశ్నలు, 50 మార్కులు- 20 నిమిషాలు
జనరల్ ఇంగ్లిష్- 40 ప్రశ్నలు, 40 మార్కులు- 35 నిమిషాలు
రీజనింగ్ ఎబిలిటీ- 40 ప్రశ్నలు, 60 మార్కులు- 35 నిమిషాలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 35 ప్రశ్నలు, 50 మార్కులు- 30 నిమిషాలు.