AP EAPCET 2025 | ఏపీలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ 2025 తుది విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఆదివారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు 28వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో వెబ్ ఆప్షన్‌కు అవకాశం ఇస్తారు. ఆగస్టు 1వ తేదీన వెబ్ ఆప్షన్ల మార్పు చేసుకోవచ్చు. ఆగస్టు 4వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 4 నుంచి 8వ తేదీ వరకు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కాగా, ఆగస్టు 4వ తేదీ నుంచే ఇంజినీరింగ్ కాలేజీ తరగతులు మొదలుకానున్నాయి. మరిన్ని వివరాలకు https://eapcet-sche.aptonline.in/EAPCET/ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. ఈ ఏడాది ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగంలో 1,89,748 మంది అర్హత సాధించారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో దాదాపు 1.20 లక్షల మంది పాల్గొన్నారు. అయితే టాప్ ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనకపోవడం గమనార్హం. ఈఏపీసెట్‌లో 1 నుంచి 200 లోపు ర్యాంకులు సాధించిన వారిలో ఇద్దరు మాత్రమే ఇక్కడి కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. 500లోపు ర్యాంకులు వచ్చిన వారిలో 12 మంది విద్యార్థులు మాత్రమే కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు.