జాతీయం
భెల్‌కు అవార్డు
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)కు క్లారివేట్ సౌత్, సౌత్ ఈస్ట్ ఏషియా ఇన్నోవేషన్ అవార్డు అక్టోబర్ 18న లభించింది. 2021కు గాను వినూత్న కంపెనీగా భారీ పరిశ్రమల విభాగంలో ఈ అవార్డు దక్కింది. భెల్‌ను 1956లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.

సీవీసీ, సీబీఐ సదస్సు
విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులతో అక్టోబర్ 20న ప్రధాని మోదీ వర్చువల్‌గా సమావేశమయ్యారు. గుజరాత్ కేవాడియాలో నిర్వహించిన ఈ సదస్సులో అవినీతిపై చర్చించారు.
పఫి సదస్సు
పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ-పఫి) సదస్సు ఢిల్లీలో అక్టోబర్ 22న వర్చువల్‌గా నిర్వహించారు. ఆర్థిక వృద్ధిలో రియల్ ఎస్టేట్ కీలక పాత్ర పోషిస్తుందని ఈ సదస్సులో పాల్గొన్న నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. దీనిని బెంగళూరులోని డీఆర్డీవో అనుబంధ సంస్థ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ) అభివృద్ధి చేసింది.
11 దేశాలతో ఒప్పందాలు
కరోనా వ్యాక్సిన్లను పరస్పరం గుర్తించే విషయంలో భారత్ 11 దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అక్టోబర్ 20న వెల్లడించింది. ఆయా దేశాల్లో పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్న పర్యాటకులు భారత్‌కు వచ్చిన తర్వాత హోంక్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. 11 దేశాలు.. జర్మనీ, యూకే, ఫ్రాన్స్, నేపాల్, లెబనాన్, బెలారస్, బెల్జియం, అర్మేనియా, ఉక్రెయిన్, హంగేరి, సెర్బియా.
100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు
భారత దేశం 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసిన సందర్భంగా ప్రధాని మోదీ అక్టోబర్ 22న జాతినుద్దేశించి ప్రసంగించారు. జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించగా 9 నెలల్లోనే 100 కోట్ల డోసులకు చేరింది. భారత్ ఇప్పటివరకు 60కి పైగా దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని కుతుబ్‌మినార్ నుంచి హైదరాబాద్ గోల్కొండ కోట వరకు 100 వారసత్వ కట్టడాలను మువ్వన్నెల రంగుల కాంతులు ప్రసరించేలా కేంద్ర పురావస్తు శాఖ చర్యలు చేపట్టింది. 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ పంపిణీలో చైనా తర్వాత రెండో దేశంగా భారత్ నిలిచింది.
అభ్యాస్ హీట్
అభ్యాస్ హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ (హెచ్‌ఈఏటీ-హీట్) క్షిపణిని డీఆర్డీవో అక్టోబర్ 22న విజయవంతంగా పరీక్షించింది. గగనతలంలో వివిధ అస్ర్తాలకు లక్ష్యంగా ఉపయోగపడే దీనిని ఒడిశాలోని చాందీపూర్‌లో పరీక్షించారు.

అంతర్జాతీయం
ఇజ్రాయెల్‌లో జైశంకర్
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇజ్రాయెల్‌లో ఐదు రోజుల పర్యటనను అక్టోబర్ 17న ప్రారంభించారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక సంబంధాల బలోపేతం, ద్వైపాక్షిక సహకారం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం) తదితర అంశాలపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, ప్రధాని నఫ్తాలి బెన్నెట్, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యైర్ ల్యాపిడ్లతో చర్చించారు.

ట్రంప్ సోషల్ మీడియా
సోషల్ మీడియా యాప్ ‘ట్రూత్ సోషల్’ను ప్రారంభించనున్నామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 21న వెల్లడించారు. బడా టెక్ సంస్థల నిరంకుశత్వాన్ని అడ్డుకునేందుకు ప్రత్యామ్నాయంగా దీనిని తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నేతగా కొనసాగారు.
పుస్తక మహోద్యమం
అమెరికాలోని అట్లాంటాలో తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక మహోద్యమాన్ని అక్టోబర్ 22న ప్రారంభించారు. తానాను 1977లో గుత్తికొండ రవింద్రనాథ్ స్థాపించారు.
మనిషికి పంది కిడ్నీ
ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి పంది కిడ్నీని అక్టోబర్ 20న విజయవంతంగా అమర్చారు. న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగోన్ ఆస్పత్రిలో కిడ్నీ పనిచేయని స్థితిలో ఉన్న ఓ బ్రెయిన్ డెడ్ మహిళకు ఈ అవయవ మార్పిడి చేశారు.
హైపర్సోనిక్ జాబితా
హైపర్సోనిక్ ఆయుధాలను అభివృద్ధి చేస్తున్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరిందని అమెరికా కాంగ్రెస్ నివేదిక అక్టోబర్ 22న వెల్లడించింది. హైపర్సోనిక్ ఆయుధాల విషయంలో అమెరికా, రష్యా, చైనా ముందజంలో ఉండగా.. వాటి తర్వాత ఆస్ట్రేలియా, భారత్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ఉన్నాయి. ధ్వని వేగం కంటే 7 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్-2 హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ కోసం భారత్, రష్యా సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ఈ నివేదికను కాంగ్రెస్ రిసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) రూపొందించింది.
వార్తల్లో వ్యక్తులు
వినయ్
అమెరికాలోని యూఎస్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ (యూఎస్టీడీఏ)కి డిప్యూటీ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా తుమ్మలపల్లి వినయ్‌ను నియమిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ అక్టోబర్ 18న నిర్ణయం తీసుకున్నారు. ఆయన అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యక్తి.

బాలసుబ్రమణియన్
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) నూతన చైర్మన్‌గా ఏ బాలసుబ్రమణియన్ అక్టోబర్ 18న నియమితులయ్యారు. ఈయన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఎండీ, సీఈవోగా పనిచేస్తున్నారు. రాధికా గుప్తా (ఎడెల్వైజ్ ఏఎంసీ ఎండీ, సీఈవో) వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియాను 1995, ఆగస్టు 22న ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
లెస్లీ కారన్
‘ఓల్డీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అమెరికన్ నటి, 90 ఏండ్ల లెస్లీ కారన్‌కు అక్టోబర్ 19న లభించింది. సుదీర్ఘకాలం సేవలందించే వారికి ‘ది ఓల్డీ’ మ్యాగజైన్ ఈ అవార్డును ఇస్తుంది. ముందుగా ఈ అవార్డును బ్రిటన్ రాణి 95 ఏండ్ల రాణి ఎలిజబెత్-2కు ప్రకటించారు. ఆమె ఈ అవార్డును తిరస్కరించారు. దీంతో ఈ అవార్డును లెస్లీకి ప్రకటించారు. ఆమెతో పాటు ఈ అవార్డు ఫుట్‌బాల్ క్రీడాకారుడు గాఫ్ హర్స్ట్, కుక్ డెలియా స్మిత్‌లకు కూడా లభించింది.
అలెక్సీ నావల్నీ
అలెక్సీ నావల్నీకి యూరోపియన్ యూనియన్ (ఈయూ) హ్యూమన్ రైట్స్ అవార్డును అక్టోబర్ 20న ప్రకటించారు. రష్యా విపక్ష నేత అయిన అలెక్సీ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. మానవతావాది, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత ఆండ్రీ సఖరోవ్ పేరుమీద ఈయూ ఈ అవార్డును ఇస్తుంది. ఈ అవార్డు కింద 50 వేల యూరోల (సుమారు రూ.43.59 లక్షలు) నగదు అందజేస్తారు.
రజనీశ్ కర్నాటక్
ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రజనీశ్ కర్నాటర్ అక్టోబర్ 22న నియమితులయ్యారు. ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు.
క్రీడలు
ఇండియన్ వెల్స్ ఓపెన్
ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ, ఏటీపీ మాస్టర్స్ సిరీస్‌ని కామెరాన్ కోరి, పౌలా బదోసా గెలుచుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో అక్టోబర్ 18న నిర్వహించిన ఫైనల్ మ్యాచుల్లో పురుషుల సింగిల్స్‌ను కామెరాన్ నోరి (బ్రిటన్) బాసిలాష్విలి (జార్జియా)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో పౌలా బదోసా (స్పెయిన్) అజరెంకా (బెలారస్)పై గెలుపొందింది.

మీరాబాయి చాను, బజరంగ్ పునియా
వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, రెజ్లర్ బజరంగ్ పునియా అమృతాంజన్ హెల్త్‌కేర్‌కు అంబాసిడర్లుగా అక్టోబర్ 18న నియమితులయ్యారు. టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి రజతం, పునియా కాంస్య పతకం సాధించారు.
శ్రీనాథ్, హర్భజన్ సింగ్
భారత మాజీ బౌలర్లు జవగళ్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్‌లకు తమ క్లబ్లో జీవితకాల సభ్యత్వం ఇచ్చినట్టు మెరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)అక్టోబర్ 19న వెల్లడించిండి. 2021కు గాను 18 మందికి ఈ గౌరవాన్ని ప్రకటించగా వారిలో హర్భజన్ సింగ్, శ్రీనాథ్‌కు చోటు దక్కింది.
ప్యాటిన్సన్ రిటైర్
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు అక్టోబర్ 20న రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు 21 టెస్టుల్లో 91 వికెట్లు, 15 వన్డేల్లో 16 వికెట్లు తీశాడు.
రెబెకా డౌనీ
టీ20 వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్ జట్టు ధరించే జెర్సీని 12 ఏండ్ల బాలిక రెబెకా డౌనీ రూపొందించిందని క్రికెట్ స్కాట్లాండ్ అక్టోబర్ 20న వెల్లడించింది. జట్టు జెర్సీ డిజైన్ కోసం దేశ వ్యాప్తంగా ఆహ్వానించగా రెబెక్కా రూపొందించిన మురుదు నీలం, ఊదా రంగులతో కూడిన జెర్సీని క్రికెట్ స్కాట్లాండ్ ఎంపిక చేసింది. స్కాట్లాండ్ దేశ జాతీయ చిహ్నమైన ‘థిస్టిల్’ రంగుల ఆధారంగా ఈ జెర్సీని రూపొందించారు. థిస్టిల్ పువ్వులతో కూడిన ఒక ముళ్ల చెట్టు.

వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్