రైల్వే తనకు చెందిన ఏ సంస్థను మూసివేయాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది? (బి) ఎ) ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఫర్ ఆల్టర్ నేటివ్ ఫ్యూయల్ (ఐఆర్వోఏఎఫ్) బి) ఇండియన్ రైల్వేస్ స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్డీసీ) సి)ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ డి) ఏదీకాదు వివరణ: రైల్వేలోని వివిధ సంస్థల హేతుబద్ధీకరణలో భాగంగా ఇండియన్ రైల్వేస్ స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను పూర్తిగా మూసివేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు సంజీవ్ సన్యాల్ సూచన మేరకు ఈ చర్య తీసుకున్నారు. బహుళ సంస్థలను విలీనం చేయడం లేదా మూసి వేయడం క్రమబద్ధీకరణలో భాగంగా చేపడుతున్నారు. ఇదే ఏడాది సెప్టెంబర్‌లో కూడా ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఫర్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్‌ను మూసి వేయాలని నిర్ణయించింది. అంటే ఇప్పటికే రెండు సంస్థలను మూసివేశారు. ఐఆర్ఎస్డీసీని 2012లో ఏర్పాటు చేశారు.
‘996’ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (డి) ఎ) కరోనా కొత్త వేరియంట్ బి) పర్యావరణ పరిరక్షణ ఉద్యమం సి) భూమికి దగ్గరగా వచ్చిన గ్రహ శకలానికి పెట్టిన పేరు డి) చైనాలో టెక్ ఉద్యోగుల ఉద్యమం వివరణ: చైనాలో టెక్ ఉద్యోగులంతా ‘996’కు వ్యతిరేకంగా ఆన్లైన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. పనివేళలు, పని రోజులను సూచించే సంఖ్య 996. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు, వారానికి 6 రోజుల పాటు చైనాలో ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి వస్తుంది. దీనినే 996గా పేర్కొంటున్నారు. దీనికి బదులు 955 తీసుకురావాలని అక్కడి టెక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు, వారంలో అయిదు రోజులే పనిదినాలు ఉండాలని వారు కోరుతున్నారు. అలాగే అగ్ర దేశాల్లో వివిధ సంస్థల్లో ఉద్యోగులు రాజీనామా బాట పడుతున్నారు. దీనిని ప్రస్తుతం ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’ అనే పేరుతో పిలుస్తున్నారు.
రామన్ గంగాఖేద్కర్ ఇటీవల ఏ అంశానికి సంబంధించి వార్తల్లో నిలిచారు? (సి) ఎ) అమెరికా చట్టసభకు ఎన్నికయ్యారు బి) యూఎన్ఎస్సీలో సభ్యత్వాన్ని పొందారు సి) సాగో సభ్యుడు డి) అమెరికా క్షిపణి పరీక్షలకు నేతృత్వం వహిస్తారు వివరణ: వ్యాధి కారక సూక్ష్మజీవుల మూలాలను పరిశీలించడానికి ‘సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఆరిజిన్స్ ఆఫ్ నావెల్ పాథోజెన్స్’ అనే ఒక అధ్యయన సంస్థను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసింది. దీనినే సంక్షిప్తంగా ఎస్‌ఏజీవో (సాగో) అంటున్నారు. కొవిడ్-19 కారక సార్స్ కోవ్-2 సహా కొత్తగా వస్తున్న వ్యాధికారక సూక్ష్మజీవుల మూలాలను ఇది పరిశీలిస్తుంది. వివిధ దేశాలకు చెందిన 26 మంది సైంటిస్టులు ఇందులో ఉన్నారు. భారత్‌కు చెందిన ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు రామన్ గంగాఖేద్కర్కు ఇందులో చోటు దక్కింది.
ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో అక్టోబర్ 14న జరిగిన ఎన్నికల్లో భారత్ కింది ఏ సభకు ఎన్నికయ్యింది? (ఎ) ఎ) మానవ హక్కుల మండలి బి) భద్రతా మండలి సి) ప్రపంచ వాణిజ్య సంస్థ డి) ఏదీకాదు వివరణ: 2022-24 కాలానికి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో భారత్ సభ్యత్వాన్ని పొందింది. అక్టోబర్ 14న ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో ఎన్నిక నిర్వహించారు. ఇందులో మొత్తం 193 దేశాలకుగాను 184 దేశాలు భారత్‌కు అనుకూలంగా ఓటు వేశాయి. 97 ఓట్లు సరిపోతాయి. కానీ భారత్ భారీ మెజారిటీ సాధించింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కేంద్రం పనిచేస్తుంది. మొత్తం 18 సభ్య దేశాల కోసం ఎన్నికలు నిర్వహించారు. 2022 జనవరి నుంచి 2024 డిసెంబర్ చివరి వరకు అంటే మూడు సంవత్సరాల పాటు భారత్ ఇందులో సభ్యురాలిగా ఉండనుంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి భారత్‌తో పాటు కజకిస్థాన్, మలేషియా, ఖతార్, యూఏఈలు కూడా యూఎన్హెచ్ఆర్సీకి ఎన్నికయ్యాయి. ఈ సంస్థలో మొత్తం 47 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి.
లూసీకి సంబంధించి కింది వాటిలో సరైనది? (డి) ఎ) అక్టోబర్ 16న అమెరికా ప్రయోగించిన వ్యోమ నౌక బి) 1974లో ఆఫ్రికాలోని ఇథియోపియాలో లభ్యమయిన మానవ శిలాజం సి) 1970 దశకంలో ‘లూసీ ఇన్ స్కై విత్ డైమండ్స్’ ప్రాచుర్యం పొందిన పాట డి) పైవన్నీ వివరణ: సౌరకుటుంబంలోని ఎనిమిది గ్రహ శకలాల రహస్యాలను తెలుసుకోడానికి అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ అక్టోబర్ 16న లూసీ అనే వ్యోమనౌకను ప్రయోగించింది. 12 సంవత్సరాల పాటు ఇది 630 కోట్ల కిలోమీటర్ల మేర ప్రయాణించనుంది. 1974లో ఆఫ్రికాలోని ఇథియోపియాలో లభ్యమైన లూసీ అనే మానవ శిలాజం పేరును దీనికి ఖరారు చేశారు. మానవ జాతి పూర్వపరాలు దీని ద్వారా తెలుసుకున్నారు. అప్పట్లో ఆ శిలాజానికి ఆ పేరు పెట్టడానికి కారణం ‘లూసీ ఇన్ స్కై విత్ డైమండ్స్’ అనే పాట ప్రాచుర్యంలో ఉంది. ఇందులోని లూసీని శిలాజానికి పేరుగా పెట్టారు. ప్రస్తుత నాసా ప్రయోగంలో నాటి బ్యాండ్‌లోని సభ్యుల బాణీలు, ప్రముఖుల సూక్తులను ఒక ఫలకంపై ముద్రించి, వ్యోమనౌకలో ఉంచారు.
కింది ఏ దేశాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు? (సి)
శ్రీలంక 2. సింగపూర్ 3. ఈక్వెడార్ ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 3 డి) 1, 2, 3 వివరణ: ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతో శ్రీలంకలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించారు. విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గిపోయాయి. దీంతో లైన్ ఆఫ్ క్రెడిట్ కోసం భారత్‌ను ఆ దేశం సంప్రదించింది. మరోవైపు నేరాలు పెరుగుతుండటంతో ఈక్వెడార్‌లో కూడా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మాదక ద్రవ్యాల వినియోగం పెరగడంతో నేరాలు అధికమవుతున్నాయని ఆ దేశం ఎమెర్జెన్సీకి నిర్ణయం తీసుకుంది.
ఏ దేశాల మధ్య సైనిక విన్యాసాలకు యుద్ధ్ అభ్యాస్ అని పేరు? (డి) ఎ)భారత్-సింగపూర్ బి)భారత్-ఇండోనేషియా సి) భారత్-యూకే డి) భారత్-యూఎస్ఏ వివరణ: భారత్, అమెరికా సైన్యాల మధ్య 17వ యుద్ధ్ అభ్యాస్ వినాన్యాసాలు అక్టోబర్ 15న ప్రారంభమయ్యాయి. 29 వరకు ఇవి కొనసాగుతాయి. భారత్ తరఫున 350 మంది సైనికులు పాల్గొన్నారు. ఈ విన్యాసాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని బికనీర్‌లో నిర్వహించారు. భారత్, అమెరికా మధ్య ఇవి అతిపెద్ద ఉమ్మడి సైనిక విన్యాసాలు. వీటిని 2004లో ప్రారంభించారు. నేటికీ కొనసాగుతున్నాయి. ఇరు దేశ సైన్యాల మధ్య సమన్వయం, అవగాహన పెంపొందించేందుకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి.
ఏ రోజున ‘గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే’ నిర్వహిస్తారు? (బి) ఎ) అక్టోబర్ 10 బి) అక్టోబర్ 15 సి) అక్టోబర్ 20 డి) అక్టోబర్ 25 వివరణ: ఏటా అక్టోబర్ 15న గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే లేదా పరిశుభ్రంగా చేతులు కడుక్కొనే రోజుగా నిర్వహిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 15న యునిసెఫ్ ఒక నివేదికను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్ల మంది చేతులను శుభ్రం చేసుకోడానికి అవసరమైన కనీస సౌకర్యాలు కూడా లేవని పేర్కొంది. అంతగా అభివృద్ధి చెందని దేశాల్లో ప్రతి 10 మందిలో ఆరుగురికి చేతులు కడుక్కోడానికి అవసరమైన సబ్బు, నీరు అందుబాటులో లేవని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 40% బడుల్లో చేతులు కడుక్కొనేందుకు సబ్బు, నీరు తదితర సదుపాయాలు లేవు. ఫలితంగా 81.80 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితం అవుతున్నారు. అంతగా అభివృద్ధి చెందని దేశాల్లో 70% పాఠశాలల్లో విద్యార్థులు చేతులు కడుక్కోడానికి చోటే లేదు.
కింది వాటిలో సరైనవి? (సి)
కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్‌లో ఉంది
కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం బీహార్‌లో ఉంది
ప్రజా రవాణాకు రోప్‌వే సేవలు తొలిసారిగా వారణాసిలో అందుబాటులోకి రానున్నాయి ఎ) 2, 3 బి) 2 సి) 1, 3 డి) 3 వివరణ: కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ అక్టోబర్ 20న ప్రారంభించారు. రూ.260 కోట్లతో దీనిని నిర్మించారు. అలాగే దేశంలో ప్రజారవాణాకు రోప్‌వే సేవలను తొలిసారిగా వారణాసిలో అందుబాటులోకి తేనున్నారు. ఈ తరహా సేవలు ఇప్పటికే బొలీవియా, మెక్సికో నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ జాబితాలో చేరనున్న మూడో దేశం భారత్. రూ.424 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. 4.2 కిలోమీటర్ల దూరాన్ని 15 నిమిషాల్లో ప్రయాణించేందుకు వీలుంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 80:20 నిష్పత్తిలో దీనికయ్యే వ్యయాన్ని భరిస్తాయి.
కింది వాటిలో సరైనవి ఏవి? (డి)
మై పార్కింగ్ యాప్‌ను ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చారు
ఫిష్వాలే యాప్‌ను అస్సాం రాష్ట్రం అభివృద్ధి చేసింది
ఫిష్వాలే యాప్‌ను పశ్చిమబెంగాల్ రాష్ట్రం అభివృద్ధి చేసింది ఎ) 1, 3 బి) 2 సి) 1 డి) 1, 2 వివరణ: ఢిల్లీలో మై పార్కింగ్ యాప్‌ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. దీనిని సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియాలు సంయుక్తంగా ప్రారంభించాయి. పార్కింగ్ స్థలం ఎక్కడ ఉందో యాప్ ద్వారా గుర్తించవచ్చు. దీనివల్ల సమయం, ఇంధనం ఆదా అవుతాయి. కాలుష్యంతో పాటు రద్దీ సమస్యను కూడా అధిగమించవచ్చు. అస్సాంలో ఫిష్వాలే అనే యాప్‌ను అభివృద్ధి చేశారు. ఇది దేశంలో మొట్టమొదటి ఈ-ఫిష్ మార్కెట్. ఈ యాప్ సాయంతో చేపలను కొనేందుకు, అమ్మేందుకు వీలుంటుంది. ఆక్వాకల్చర్‌కు సంబంధించిన ఔషధాలు, పరికరాలను కూడా కొనుగోలు చేయవచ్చు.
‘ది చాలెంజ్’ అనే సినిమా ప్రత్యేకత ఏంటి? (ఎ) ఎ) ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిత్రీకరించిన తొలి చిత్రం బి) పూర్తిగా కొవిడ్ వార్డుల్లోనే తీసిన సినిమా సి) అతి తక్కువ సమయంలో వ్యాక్సిన్ అందరికీ అందించే ఉద్దేశంతో తీసిన తొలి చిత్రం డి) ఏదీకాదు వివరణ: రష్యాకు చెందిన సినిమా ‘ది చాలెంజ్’. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో (ఐఎస్ఎస్) చిత్రీకరించారు. ఈ ఘనత సాధించిన తొలి సినిమా ఇదే. ఈ సినిమా దర్శకుడు క్లిమ్ షిపెంకో, నటి యూలియా పెరెస్లిడ్ 12 రోజుల పాటు ఐఎస్ఎస్లోనే దీనిని చిత్రీకరించారు. అంతరిక్షానికి వెళ్లిన ఒక వ్యోమగామి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడంతో అతడిని పరీక్షించేందుకు వెళ్లిన ఒక మహిళా వైద్యురాలి కథ నేపథ్యంలో ఈ సినిమా తీశారు.
ప్రపంచ ఆహార భద్రతా సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? (సి) ఎ) 40 బి) 24 సి) 71 డి) 100 వివరణ: ప్రపంచ ఆహార భద్రతా సూచీలో మొత్తం 113 దేశాలకుగాను భారత్ 71వ స్థానంలో ఉంది. లండన్ కేంద్రంగా పనిచేసే ఎకనామిస్ట్ ఇంపాక్ట్ అనే సంస్థ ఈ సూచీని విడుదల చేసింది. అందుబాటులో ఆహారం, నాణ్యత, భద్రత, సహజవనరులు తదితర 58 అంశాలను పరిశీలించి ర్యాంకులను కేటాయిస్తారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో రెండోది ఆకలికి సంబంధించింది. 2030 నాటికి ఎవరూ ఆకలితో ఇబ్బందులు పడకుండా అన్ని దేశాలు లక్ష్యాన్ని సాధించాలి. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఐర్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, ఫిన్లాండ్ నిలిచాయి.
కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి? (డి)
తొలి అటల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని రాజస్థాన్‌లో ఏర్పాటు చేశారు
తొలి విశ్వకర్మ వాటికను ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు ఎ) 1 బి) 2 సి) ఏదీకాదు డి) 1, 2 వివరణ: దేశవలో తొలి అటల్ ఇన్నో వేషన్ సెంటర్‌ను రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీలో ప్రారంభించారు. దీనిని నీతి ఆయోగ్ ఏర్పాటు చేసింది. సమాజానికి ఉపయోగపడే సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే చేతివృత్తి కళాకారులను ప్రోత్సహించేందుకు విశ్వకర్మ వాటికలను హునర్ హాట్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వందల సంవత్సరాలుగా చేతివృత్తిని కొనసాగిస్తున్న వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. తొలి విశ్వకర్మ వాటికను ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఏర్పాటు చేశారు. చేతివృత్తులవాళ్లు తమ భగవంతుడిగా విశ్వకర్మను కొలుస్తారు.
‘జియోరిస్సా మా స్మేయాన్సిస్’ ఏ జీవికి చెందిన జాతి? (ఎ) ఎ) నత్త బి) తాబేలు సి) ఈగ డి) కరోనా వివరణ: నత్తలో కొత్త జాతిని మేఘాలయాలో గుర్తించారు. ఈ జీవి పొడవు రెండు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంది. స్థానికంగా ఉండే ఖాసీ హిల్స్ జిల్లాలో ఉన్న సున్నపురాయి గుహల్లో ఇది కనిపించింది. దీనికి ‘జియోరిస్సా మా స్మెయాన్సిస్’ అని పేరు పెట్టారు.
అక్టోబర్ 15ని ఏ రోజుగా నిర్వహిస్తారు (సి)
ప్రపంచ విద్యార్థి దినోత్సవం
అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు వివరణ: ఏటా అక్టోబర్ 15ని ప్రపంచ విద్యార్థి దినోత్సవం, అంతార్జతీయ గ్రామీణ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తారు. అక్టోబర్ 15న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి. ఈ రోజున విద్యార్థుల దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించడంతో పాటు వారి అభ్యున్నతికి విశేష కృషి చేసిన కలామ్ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థుల దినోత్సవంగా నిర్వహిస్తారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత, అక్కడి జీవన నాణ్యత, సుస్థిరాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మహిళల సేవలకు గుర్తుగా ఇదే రోజు అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంగా కూడా నిర్వహిస్తారు.