హైదరాబాద్, సెప్టెంబర్ 10(నమస్తే తెలంగాణ) : పశువులు, పెంపుడు జంతువుల ఔషధాల, పోషకాల ఉత్పత్తి సంస్థ జోయెటిస్..హైదరాబాద్లో గ్లోబల్ సామర్థ్య కేంద్రాన్ని(జీసీసీ)ని నెలకొల్పింది. 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ జీసీసీ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పశు వైద్య రంగంలో ప్రపంచ దిగ్గజం జోయెటిస్ రాష్ట్రంలో ప్రవేశించడంతో లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ సరికొత్త మైలు రాయిని అధిగమించినట్లు అయిందని పేరొన్నారు. పశువులు, పెంపుడు జంతువుల ఔషధాలు, పోషకాల ఉత్పత్తిలో జోయెటిస్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని చెప్పారు. ఈ జీసీసీ సెంటర్ నుంచి బిజినెస్ ఆపరేషన్స్, డాటా మేనేజ్మెంట్, పరిశోధన, అభివృద్ధి లాంటి కార్యకలాపాలను నిర్వహిస్తుందని వెల్లడించారు. 2025 చివరి నాటికి వందలాది మంది సాఫ్ట్వేర్, పశువైద్య నిపుణులకు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోయెటిస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సార్బౌగ్, జోయెటిస్ ఇండియా సామర్థ్య కేంద్రం వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్, టీజీఐఐసీ సీఈఓ మధుసూదన్, యూఎస్ కాన్సులేట్ అధికారులు, యూఎస్ ప్రభుత్వ కన్సల్టెంట్లు నెల్సన్ కన్నింగ్ హామ్, రెబెకా డ్రేమే, ఫ్రాంక్ టల్లుటో, అఖిల్ బెరి పాల్గొన్నారు.