పంచనారసింహుడు కొలువుదీరిన యాదాద్రి భక్తజనులతో పులకించింది. ఆదివారం సెలవు కావడంతోపాటు దసరా పండుగ ముగిసిన నేపథ్యంలో స్వామి వారి దర్శనం కోసం జనం బారులుదీరారు. కుటుంబ సమేతంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి.
యాదాద్రి, అక్టోబర్17 : యాదాద్రి శ్రీ లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లు, మండపాల్లో కోలాహలం నెలకొంది. దసరా పండుగకు సొంత గ్రామాలకు వెళ్లి తిరుగు ప్రయాణాలతోపాటు ఆదివారం సెలవు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి కిటకిటలాడింది. ఎటుచూసినా క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మొదలైంది. నారసింహుడికి నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనారసింహుడిని ఆరాధిస్తూ పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలో ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్ఠించి కల్యాణతంతు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం, నవగ్రహాలకు తైలాభిషేకం చేశారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. కొండకింద పాతగోశాల వద్ద గల మండపంలో జరిగిన సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొని వ్రతమాచరించారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యపూజలు జరిగాయి. శ్రీవారి ఖజానాకు రూ. 20,31,973 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 3,88,410
వీఐపీ దర్శనాలు 3,45,000
నిత్యకైంకర్యాలు 700
వేద ఆశీర్వచనం 3,612
సుప్రభాతం 1,500
క్యారీబ్యాగుల విక్రయం 4,000
టెంకాయల విక్రయం 60,000
వ్రత పూజలు 88,000
కల్యాణకట్ట టిక్కెట్లు 39,000
ప్రసాద విక్రయం 7,46,232
వాహన పూజలు 18,100
టోల్గేట్ 2,030
అన్నదాన విరాళం 19,064
సువర్ణ పుష్పార్చన 1,42,060
యాదరుషి నిలయం 93,600
పాతగుట్ట నుంచి 53,430
గోపూజ 700
ఇతర విభాగాలు 300