యాచారం, అక్టోబర్ 5 : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో మరో భూ సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం 1,392 ఎకరాల భూమిని సేకరించేందుకు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో యాచారం మండలం నజ్దిక్‌సింగారం, నందివనపర్తి, చింతపట్ల, కొత్తపల్లి, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలతోపాటు కందుకూరు మండలంలోని పలు గ్రామాలతో కలిపి ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం 13,500 ఎకరాలు సేకరించిన విషయం తెలిసిందే. మరో 2,500 ఎకరాల పట్టా భూములను రైతులు ఫార్మాసిటీకి ఇవ్వలేదు. ఇంకొన్ని భూములు కోర్టు కేసులో పెండింగ్‌లో ఉన్నాయి. సదరు భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. ఇటీవలే మండలంలోని మొండిగౌరెల్లిలో పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం ప్రభుత్వం అసైన్డ్ భూముల సేకరణ చేపట్టింది. గ్రామంలోని 19, 68, 127వ సర్వే నంబర్లలో 821.11ఎకరాల భూ సేకరణకు సర్వే చేపట్టింది. సర్వేలో అవకతవకలున్నాయని రైతులు ఇటీవలే ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇది చాలదన్నట్టు మరో భూ సేకరణకు ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రైతుల భూములపై మరో పిడుగు పడినట్టయ్యింది.
యాచారం మండలంలోని నజ్దిక్‌సింగారం, కొత్తపల్లి, చింతపట్ల, నందివనపర్తి గ్రామాల్లో భూములను సేకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. కొత్తపల్లి పరిధిలోని సర్వే నంబర్లు 182, 317లో గల 29ఎకరాలు, నజ్దిక్సింగారంలోని సర్వే నంబర్లు 163 నుంచి 219 వరకు ఉన్న 1,036.11 ఎకరాలు, నందివనపర్తిలోని సర్వే నంబర్ 462 లోగల 195.32 ఎకరాలు, చింతపట్లలోని సర్వే నంబర్ 124లోగల 131.28 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆరు నెలల క్రితమే నోటిఫికేషన్ జారీ చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నందివనపర్తిలోని ఓంకారేశ్వరాలయ భూములను తాటిపర్తి, కుర్మిద్ద, నందివనర్తి, నజ్దిక్‌సింగారం గ్రామాల రైతులు ఎన్నో ఏండ్లుగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో కౌలు రైతులు అయోమయానికి గురవుతున్నారు. తాత,ముత్తాతల కాలం నుంచి దేవాలయ భూములను సాగు చేసుకుంటున్నామని, భూ సేకరణ పేరుతో బలవంతంగా లాక్కుంటే ఎలా బతుకాలని కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. బలవంతంగా భూములు గుంజుకుంటే ఊరుకునేదిలేదని, ప్రభుత్వంపై మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు నందివనపర్తి, చింతపట్ల, కొత్తపల్లి గ్రామాల రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా భూములిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.