అదిత్ అరుణ్, శివానీరాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’. కె.వి.గుహన్ దర్శకుడు. రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా॥రవిప్రసాద్రాజు దాట్ల నిర్మిస్తున్నారు. త్వరలో సోని లివ్ ఓటీటీ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. తెలుగులో తొలిసారి కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ కథాంశంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కిస్తున్నాం. ఇంటర్నెట్ ద్వారా ఒకరికొకరు పరిచయమైన కొంత మంది వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఎవరు, ఎక్కడ, ఎందుకు అనే ప్రశ్నల వెనకున్న రహస్యాన్ని ఓ యువకుడు ఎలా తెలుసుకున్నాడనేది ఉత్కంఠను పంచుతుంది. అదిత్ అరుణ్, శివానీ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. ప్రియదర్శి, వైవాహర్ష, దివ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె కింగ్.