సాకర్ ప్రపంచకప్ నాకౌట్ రౌండ్ మొదలైన తొలి రోజే సంచలనాలకు వేదికైంది. ఫుట్‌బాల్ ప్రపంచంలో తిరుగులేని శక్తులుగా గుర్తింపు పొందిన యూరప్ మేటి జట్లు జర్మనీ, నెదర్లాండ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. రెండు వేర్వేరు థ్రిల్లింగ్ రౌండ్-32 మ్యాచ్‌ల్లో పెనాల్టీ షూటౌట్స్ వాటి కొంపముంచాయి. నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన జర్మనీని పరాగ్వే షూట్ చేయగా.. బలమైన నెదర్లాండ్స్ జట్టును మొరాకో టోర్నీ నుంచి ఇంటికి పంపింది. ఈ చారిత్రాత్మక విజయాలతో పరాగ్వే, మొరాకో ప్రిక్వార్టర్ ఫైనల్ దూసుకెళ్లాయి. ఈ గెలుపుతో 2002 ప్రపంచకప్ నాకౌట్లో జర్మనీ చేతిలో ఎదురైన ఓటమికి పరాగ్వే 24 ఏండ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది. మరోవైపు కనీసం ప్రిక్వార్టర్స్ చేరకుండానే డచ్ టీమ్ తొలిసారి ఫిఫా కప్‌లో పోరాటం ముగించింది.
ఫాక్స్‌బరో : ఫిఫా ర్యాంకింగ్స్‌లో 34వ స్థానంలో ఉన్న పరాగ్వే ఈ ప్రపంచకప్‌లోనే అతిపెద్ద సంచలనం సృష్టించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జిల్లెట్ స్టేడియంలో జరిగిన రౌండ్-32 మ్యాచ్‌లో 12వ ర్యాంకర్ జర్మనీపై జయకేతనం ఎగురవేసింది. పెనాల్టీ షూటౌట్లో 4-3 తేడాతో గెలిచింది. పరాగ్వే గోల్‌కీపర్ ఓర్లాండో గిల్ రెండు కీలక పెనాల్టీలను అడ్డుకొని జట్టు విజయంలో హీరోగా నిలవగా, సడన్ డెత్ కిక్‌ను జోస్ కెనాల్ గోల్‌గా మలిచి విజయాన్ని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్ ఆట ఆరంభం నుంచే జర్మనీ 78 శాతం బంతిని తన ఆధీనంలో ఉంచుకొని దాడులు చేసినప్పటికీ పరాగ్వే బలమైన డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది.
ఫస్టాఫ్‌లో చాలా వరకు జర్మనీ దాడులను తిప్పికొట్టిన పరాగ్వే చివర్లో ఒక్కసారిగా గేరు మార్చింది. 42వ నిమిషంలో కౌంటర్ ఎటాక్‌కు దిగింది. మిగ్యుల్ అల్మిరాన్ అందించిన పాస్‌ను మథియాస్ గలార్జా అందుకొని క్రాస్ చేయగా, అన్మార్క్గా ఉన్న ఎన్సిసో హెడర్ ద్వారా బంతిని నెట్లోకి పంపడంతో పరాగ్వే 1-0తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. అయితే, ఈ ఆనందం పరాగ్వేకు ఎంతోసేపు నిలువలేదు. రెండో అర్ధభాగం మొదలైన వెంటనే జర్మన్ ప్లేయర్లు జోరు పెంచారు. 52వ నిమిషంలో ఫ్లోరియన్ విరట్జ్ అందించిన అద్భుత క్రాస్‌ను అందుకున్న కై హావెరట్జ్ హెడర్ ద్వారా గోల్ కొట్టి 1-1తో స్కోరుసమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లూ మరో గోల్ కోసం ప్రయత్నించినా సక్సెస్ అవ్వలేదు.

నిర్ణీత 90 నిమిషాల్లో స్కోరు సమం కావడంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్‌కు దారి తీసింది. అక్కడ 102వ నిమిషంలో జర్మనీ ఆటగాడు జోనాథన్ తాహ్ హెడర్ ద్వారా గోల్ కొట్టి జర్మనీని గెలిపించినంత పని చేశాడు. అయితే వీడియో అసిస్టెంట్ రిఫరీ (వార్) రివ్యూలో జర్మనీ ప్లేయర్ వాల్డెమార్ ఆంటోన్ అంతకుముందే పరాగ్వే గోల్ కీపర్ ఓర్లాండో గిల్‌ను కిందకు నెట్టేసినట్లు తేలడంతో రిఫరీ ఆ గోల్‌ను రద్దు చేశాడు.దీంతో మ్యాచ్ షూటౌట్‌కు వెళ్లింది.సాధారణంగా మేజర్ టోర్నమెంట్లలో పెనాల్టీ షూటౌట్లలో వరుసగా 6 విజయాలతో తిరుగులేని రికార్డుతో ఉన్న జర్మనీని ఈసారి పరాగ్వే కీపర్ గిల్ బోల్తా కొట్టించాడు.
జర్మనీ ఎగ్జిట్ షాక్ నుంచి తేరుకునేలోపే వరల్డ్‌కప్ మరో అనూహ్య ఫలితం వచ్చింది. మెక్సికోలోని ఎస్టాడియో సేడియంలో జరిగిన ఉత్కంఠ పోరులో ప్రపంచ 6వ ర్యాంకర్ మొరాకో షూటౌట్లో 3-2 తేడాతో 7వ ర్యాంకర్ నెదర్లాండ్స్‌ను ఓడించింది. ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ జట్టు ఇంత తొందరగా టోర్నీ నుంచి నిష్క్రమించడం ఇదే తొలిసారి. గత 11 మెగా టోర్నీల్లో ఆ జట్టు ప్రిక్వార్టర్స్‌కు వచ్చింది. 2022 ఎడిషన్‌లో క్వార్టర్ ఫైనల్ ఆడింది. కానీ, ఈసారి మాత్రం ముందుగానే ఇంటిదారి పట్టింది. మొరాకో మిడ్‌ఫీల్డర్ ఇస్మాయిల్ సైబారీ ఆఖరి పెనాల్టీని గోల్‌గా మార్చి జట్టును గెలిపించాడు.మ్యాచ్‌పై ఎక్కువ శాతం మొరాకో పట్టు సాధించినప్పటికీ డచ్ కౌంటర్ ఎటాకింగ్ వ్యూహంతో ఆడింది. 72వ నిమిషంలో క్రిసెన్సియో సమ్మర్విల్ అందించిన పాస్‌తో కొడీ గ్యాక్‌పో గోల్ కొట్టి నెదర్లాండ్స్‌కు 1-0 ఆధిక్యం అందించాడు.

ఇటీవలే తన పుట్టబోయే బిడ్డను కోల్పోయి బాధలో ఉన్నప్పటికీ దేశం కోసం ఆడిన గ్యాక్‌పో ఈ గోల్ సాధించిన తర్వాత మైదానంలోనే కన్నీరు పెట్టుకున్నాడు. ఇక, నెదర్లాండ్స్ విజయం ఖాయమనుకుంటున్న తరుణంలో, ఇంజూరీ టైమ్ 91వ నిమిషంలో మొరాకో ప్లేయర్ ఇసా దియోప్ అద్భుతం చేశాడు. కెమ్స్డైన్ తాల్బీ లెఫ్ట్ సైడ్ నుంచి అందించిన లాంగ్ క్రాస్‌ను దియోప్ హెడర్ ద్వారా నెట్లోకి పంపి స్కోరును 1-1తో సమం చేశాడు. ఎక్స్ట్రా టైమ్‌లో ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. షూటౌట్లో ముగ్గురు డచ్ ఆటగాళ్లు పెనాల్టీలను మిస్ చేశారు. షూటౌట్ 2-2తో సమంగా ఉన్నప్పుడు సమ్మర్విల్ కొట్టిన షాట్‌ను మొరాకో కీపర్ యాసిన్ బోనో ఎడమ కాలు, చేతితో అద్భుతంగా అడ్డుకున్నాడు. ఆ వెంటనే వచ్చిన అవకాశాన్ని ఇస్మాయిల్ సైబారీ గోల్‌గా మలిచి మొరాకోకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.