ఘట్కేసర్ రూరల్, మార్చి 7: ప్రతి మహిళ సవాళ్లను ఎదుర్కొని అన్ని రంగాల్లో రాణించినప్పుడే గుర్తింపు ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. మండల పరిధి వెంకటాపూర్‌లోని అనురాగ్ యూనివర్సిటీలో సోమవారం మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తమ కళలు, నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మహిళల్లో సామాజిక చైతన్యం వచ్చి అన్ని రంగాల్లో ముందుంటున్నారని తెలిపారు. అతి సామాన్య పనుల నుంచి నేడు విమానాలు నడపడంతో పాటు మిలటరీలో చేరి ప్రతిభను చాటుతున్నారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు వివరించారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నదని తెలిపారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు వారి భద్రత కోసం మహిళా హెల్ప్‌లైన్ నంబర్, వాట్సాప్ నంబర్లో సంప్రదిస్తే సకాలంలో సహాయం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఈవో నీలిమ, రిజిస్ట్రార్ సమీనా ఫాతిమా, వైస్ చాన్స్‌లర్ రామచంద్రం, శ్రీదేవి, మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : మహిళలు ఎవరికీ తక్కువ కాదని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలందరూ ఎన్నో సంవత్సరాల నుంచి సహజంగానే భర్తకు చేదోడు వాదోడుగా ఉంటున్నారని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని 1975 నుంచి ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో సూర్యలత, కలెక్టరేట్ మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
మెహిదీపట్నం, మార్చి 7: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం చారిత్రాత్మక గోల్కొండ కోటలోకి సందర్శకులకు, పర్యాటకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు పురావస్తు శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం కోట సందర్శనకు వచ్చే వారి నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని అధికారులు పేర్కొన్నారు.
ఖైరతాబాద్, మార్చి 7 : విద్యుత్ శాఖ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఖైరతాబాద్‌లోని కార్యాలయంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జ్యోతిరాణి, ఎం.తులసీ నాగరాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ లలిత, ఉపాధ్యక్షురాలు కవిత, సహాయకార్యదర్శి మంగమ్మ, ఫైనాన్స్ సెక్రటరీ లత, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ భాగ్య, ఆశ, అరవింద్, కార్యవర్గ సభ్యులు రాజేశ్వరి, ఉమా, ఆసియా, ప్రేమ తదితరులు పాల్గొన్నారు.