ప్రపంచం యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటున్నది. పశ్చిమాసియాలోని ఎడారి దేశాల్లో విస్తరించిన ఈ సమరంలో అక్కడి నీటి వసతులూ లక్ష్యాలుగా మారడం గమనించాం. అంటే ఒక దేశానికి నీటిబొట్టు ఆయువుపట్టు అన్నట్టు. అంతెందుకు ఎండాకాలంలో మన దగ్గరా నీటి చుక్క సంపాదించేందుకు యుద్ధాలే చేయాల్సి వస్తుంటుంది. మరి అంత కష్టపడి సంపాదించిన ఒక్కో చుక్కనూ అమృత బిందువులా చూసుకోవడమూ ముఖ్యమే. కాస్త ఆలోచించి మహిళలుగా మనం ఆ బాధ్యత తీసుకుంటే కనీసం వారానికి ఒక్క ట్యాంకర్ అయినా మిగల్చగలం. మరి ఆ మార్గాలేంటో చూసేద్దాం!
నిద్ర లేస్తే నీళ్లు కావాలి. పళ్లు, ఒళ్లు శుభ్రం చేసుకోవడం మొదలు… వంట పనులకు, తాగేందుకు, మొక్కలు పెంచేందుకు ఇలా ప్రతిపనికీ నీళ్లు కావాల్సిందే. గుక్కెడు నీళ్లకు అలమటించే మనుషులున్న ప్రాంతాలూ మన దగ్గరే ఉన్నాయి. 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు నీటి కొరత ప్రాంతాల్లో జీవించే అవకాశం ఉందని అంచనా. అందుకే నేటి కుటుంబ అవసరాలు చూసుకుంటూనే భవిష్యత్తు తరాల కోసం నీటిని కాపాడే బాధ్యత కూడా మహిళదే. ఈ వేసవిలో ప్రతి గృహిణి పొదుపు యోధురాలిగా మారితే నీటి యుద్ధం ఆపే శక్తి మనదే అవుతుంది.
వంటగదిలోనే ఎక్కువ నీరు వృథా అవుతుంటుంది. కూరగాయలు కడిగేటప్పుడు ట్యాప్‌ను నిరంతరం తిప్పి ఉంచకుండా ఒక గిన్నెలో నీరు తీసుకుని కడగడం మంచిది. పండ్లు కూరగాయలు ఒక్కొక్కటిగా ట్యాప్ కింద కడగకుండా ఒక పెద్ద గిన్నెలో నీరు తీసుకుని అందులో కడిగితే నీటి వినియోగం తగ్గుతుంది. పాత్రలు కడిగేటప్పుడు కూడా ఒక్కో పాత్ర కడుగుతూ నీరు వదలకుండా ముందుగా సబ్బు రాసి తర్వాత కడిగితే నీటి వినియోగం తగ్గుతుంది.
షవర్‌తో ఐదు నిమిషాల స్నానం చేస్తే బకెట్ స్నానం కంటే చాలా ఎక్కువ నీరు ఖర్చవుతుంది. కాబట్టి బకెట్లో నీళ్లు పట్టుకుని స్నానం చేయడం అలవాటు చేసుకోవడం మంచిది. బ్రష్ చేస్తూ ట్యాప్‌ను తెరిచి ఉంచకపోవడం వంటి చిన్న అలవాట్లు పెద్ద మార్పును తీసుకురాగలవు.

ఒకసారి వాడిన నీటిని మరో పనికి వినియోగించే అలవాటు పెంచుకోవాలి. ఉదాహరణకు దుస్తులు జాడించిన నీటిని బాత్రూం శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. బియ్యం, పప్పులు కడిగిన నీటిని మొక్కలకు వాడితే రెండింతల ప్రయోజనం ఉంటుంది.
కొద్దికొద్దిగా దుస్తులు వేసి వాషింగ్ మెషిన్ ఆన్ చేయడం వల్ల నీరు ఎక్కువగా ఖర్చవుతుంది. ఒకేసారి పూర్తి లోడ్‌తో ఉతకడం మంచిది. ఇప్పుడు మార్కెట్లో వచ్చే చాలా వాషింగ్ మెషిన్లలో ‘ఎకో మోడ్’ కూడా ఉంటుంది. దాన్ని ఉపయోగిస్తే నీటితో పాటు విద్యుత్ కూడా ఆదా అవుతుంది.
మొక్కలు ఇంటికి అందం ఇస్తాయి. కానీ, వాటికి నీళ్లు పోసే సమయం కూడా ముఖ్యమే. వేసవిలో మధ్యాహ్నం మొక్కలకు నీళ్లు పోస్తే అవి ఎక్కువగా ఆవిరైపోతాయి. ఉదయం లేదా సాయంత్రం నీళ్లు పోయడం మంచిది. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ఇంటి తోటల్లో కూడా ఉపయోగిస్తే నీరు చాలా వరకు ఆదా అవుతుంది.
మిగిలిపోయిన ఐస్ క్యూబ్స్‌ను పారేయకుండా చిన్న మొక్కల్లో వేయొచ్చు. అవి క్రమంగా కరిగి మొక్కలకు తేమనిస్తాయి.

ఇంటి చుట్టూ నీడనిచ్చే మొక్కలు పెంచితే ఇంట్లో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో కూలర్లు, నీటి వినియోగం కూడా కొంతవరకు తగ్గుతుంది.
ఎండాకాలంలో కొన్ని చోట్ల పరిమిత సమయంలో మాత్రమే నీళ్లు వస్తాయి. అలాంటప్పుడు బకెట్లు, డ్రమ్ముల్లో నీళ్లు నిల్వ చేసుకుంటారు. వాటి మీద మూత పెట్టడం ద్వారా ఆ నీరు ఆవిరైపోకుండా చూసుకోవచ్చు.
బకెట్లో చల్లని నీళ్లు కావాలని చాలామంది నల్లా తిప్పి వదిలేస్తుంటారు. దానికి బదులుగా రెండు బాటిళ్ల ఫ్రిడ్జ్ నీళ్లు వాడుకుంటే ఎంతో నీరు ఆదా అవుతుంది.

మనకు తోచిన నీటి ఆదా పద్ధతుల్ని అనుసరిస్తూ కుటుంబ సభ్యులు కనీసం రోజుకు ఒక బకెట్ నీటిని పొదుపు చేయాలని చాలెంజ్ పెట్టుకోవాలి. తద్వారా వేసవి మొత్తం మీద ఎన్నో లీటర్ల నీటిని మిగల్చ గలుగుతాం. ముఖ్యంగా పిల్లలకు నీటి పొదుపును అలవాటు చేయగలిగితే భవిష్యత్తును భద్రం చేసినట్టే!
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 14 లక్షల మంది అసురక్షిత నీరు, పరిశుభ్రత లోపాల కారణంగానే మరణిస్తున్నారు.
1 నిమిషం ట్యాప్ ఓపెన్‌గా ఉంచితే సుమారు 6 లీటర్ల నీరు వృథా అవుతుంది.
5 నిమిషాల షవర్ స్నానం= దాదాపు 50 లీటర్ల నీటి వినియోగం.
ఒక చిన్న లీక్ ట్యాప్ సంవత్సరానికి దాదాపు 10,000 లీటర్ల నీటిని వృథా చేయగలదు.