ముంబై: ఒక మహిళ తన ప్రియుడ్ని హత్య చేసింది. సంచిలో మృతదేహాన్ని కుక్కి బాత్రూమ్లో ఉంచింది. ట్యాప్ ఆన్ చేసి అద్దె ఇంటి నుంచి వెళ్లి పోయింది. రెండు నెలల తర్వాత ఇంటి యజమానికి వాయిస్ మెసేజ్ పంపింది. (Woman Kills Lover) ప్రియుడి మృతదేహాన్ని తొలగించాలని చెప్పడంతో ఓనర్ షాకయ్యాడు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కల్యాణ్‌లోని ఒక హౌసింగ్ సొసైటీలోని ఫ్లాట్ నంబర్ 104 నుంచి రెండున్నర నెలలుగా నీరు లీక్ కావడాన్ని కొందరు నివాసితులు గమనించారు. ఆ ఫ్లాట్‌కు లాక్ వేసి ఉండటంతో ఇంటి యజమాని అజయ్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటిని అద్దెకు తీసుకున్న మహిళను సంప్రదించేందుకు ఆయన పదేపదే ప్రయత్నించినా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
కాగా, ఒక రోజు ఆ ఫ్లాట్ అద్దెకు తీసుకున్న మహిళ నుంచి అజయ్ పాటిల్‌కు ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. తన ప్రియుడిని హత్యచేసినట్లు ఆమె చెప్పింది. అతడి మృతదేహం బాత్రూమ్లో ఉన్నదని, అక్కడి నుంచి తొలగించాలని ఇంటి యజమానిని కోరింది. ఈ మెసేజ్ విన్న అజయ్ షాకయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇచ్చాడు.
మరోవైపు పోలీసులు ఆ ఫ్లాట్‌కు చేరుకున్నారు. ఒక సంచిలో కుక్కిన వ్యక్తి మృతదేహం బూత్రూమ్లో ఉండటం చూశారు. పదునైన ఆయుధంతో అతడి తలపై కొట్టి హత్యచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రక్తపు మరకలను కడిగేందుకు, ఇతర ఆధారాలు నాశనం చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే బాత్రూమ్ ట్యాప్‌ను ఓపెన్ చేసి వదిలేసినట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే ప్రియుడ్ని హత్య చేసిన ఆ మహిళ కోల్‌కతా పారిపోయినట్లు పోలీసులు తెలుసుకున్నారు. నిందితురాలి ఆచూకీ గుర్తించి ఆమెను అరెస్ట్ చేసేందుకు మూడు పోలీస్ బృందాలను అక్కడకు పంపినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.