కొత్తగూడెం ప్రగతి మైదాన్, మార్చి 30: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం మావోయిస్టుల ఘాతుకానికి ఓ మహిళ బలైంది. బీజాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోధీపారాకు చెందిన సుశీల సోధి ఇప్ప పువ్వు సేకరణకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు బొట్టమర్కాలోని కొండ ప్రాంతానికి వెళ్లింది.
ఈ క్రమంలో జవాన్లను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అమర్చిన మందుపాతరపై సుశీల అడుగు వేయడంతో అది పేలి తీవ్రంగా గాయపడింది. గమనించి గ్రామస్థులు అక్కడికి చేరుకుని సుశీలను హుటాహుటిన ఉసూర్ దవాఖానకు తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.