నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ 75వ వార్షికోత్సవం కూడా. ‘అందరికీ ఆరోగ్యం’ ఈ ఏడాది నినాదం. కుటుంబ ఆరోగ్యం.. మహిళ ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. పోషక విలువలు, శుభ్రత, రోగ నిరోధక శక్తి, వివిధ రుగ్మతల పట్ల ఆమెకు అవగాహన ఉంటేనే కుటుంబం కళకళలాడుతుంది. దవాఖాన ఖర్చులు తప్పుతాయి. ఇంటి పెద్ద అప్పుల ఊబి నుంచి బయటపడతాడు.
కాబట్టే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘అందరికీ ఆరోగ్యం’ నినాదంతో మహిళలనూ భాగస్వాములను చేయాలని భావిస్తున్నది. ప్రత్యేక ఉత్సవాల లోగోల్లోనూ మహిళ బాధ్యతల్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. అదే సమయంలో మహిళ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆర్థికంగా ఎదగడం ద్వారానే మహిళ ఆరోగ్యపరమైన గండాలను తప్పించుకోగలదని సూచించింది. వేతనాల విషయంలో వివక్షను అధిగమించినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. కార్పొరేట్ కారిడార్ నుంచి కూలీల అడ్డా వరకూ ప్రతిచోటా అతని శ్రమకు ఒక ధర, ఆమె పనికి ఒక వెల. ఈ తేడాలు పోవాలి. మంచిరోజులు రావాలి.