నా వయసు నలభై. నెలసరిలో ఇబ్బందుల వల్ల కొన్ని రోజులు మందులు వాడాను. ఇటీవల పరీక్షలు చేసి, నాకు నెలసరి ఆగి పోయిందని, మెనోపాజ్ వచ్చిందని నిర్ధారించారు. మెనోపాజ్ మరీ నలభై ఏండ్లకే వస్తుందా? మెనోపాజ్ ఏ వయసులో రావాలి. దీనివల్ల భవిష్యత్‌లో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయా? త్వరగా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– ఓ సోదరి
జ: సాధారణంగా 95 శాతం మహిళలలో మెనోపాజ్ 48-52 ఏండ్ల మధ్య వస్తుంది. కొందరిలో 56 ఏండ్ల వరకూ నెలసరి ఆగిపోదు. నలభై ఎనిమిది ఏండ్లకంటే ముందే నెలసరి ఆగిపోతే, దాన్ని
‘ప్రిమెచ్యూర్ మెనోపాజ్’ లేదా ‘ప్రిమెచ్యూర్ ఒవేరియన్
ఫెయిల్యూర్’ అంటారు. మెనోపాజ్ వచ్చిందంటే రుతుక్రమం ఆగిపోవడం మాత్రమే కాదు, అండాశయాల పనితీరు కూడా మందగించినట్టే. అండాశయాలు మహిళల చర్మం, గుండె, ఎముకలు, మెదడు మొదలైన కీలక భాగాలపై ప్రభావం చూపుతాయి. సాధారణ
సమయంలో మహిళల్లో విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. అలాగే, ఎముకలను దృఢంగా ఉంచుతుంది.
మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ ఉత్పత్తి ఆగిపోతుంది. అందుకే, మెనోపాజ్ వచ్చిన రెండుమూడేండ్లలో చాలామందికి ఫ్రాక్చర్లు అవుతుంటాయి. ముఖ్యంగా తుంటి, మణికట్టు భాగాలు దెబ్బతింటాయి. గుండెపోటు కూడా మెనోపాజ్ తర్వాతే రావడం గమనిస్తుంటాం. మెదడులో ‘గ్రే మ్యాటర్’ తగ్గడం వల్ల అల్జీమర్స్ తదితర సమస్యలు వస్తాయి. వీటితోపాటు ఉన్నట్టుండి ఒళ్లంతా చెమటలు పట్టడం, యోనిభాగం పొడి బారడం, మూత్రాశయ సమస్యలు, మానసిక రుగ్మతలు, వివిధ రకాల క్యాన్సర్లు దాడి చేయవచ్చు. ఈస్ట్రోజన్‌ను అందించే సోయా చంక్స్, నువ్వులు,అవిసె గింజలు బాగా తినాలి. వైద్యుల సలహాతో ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. మానసిక ఒత్తిడికి లోనవుతుంటే కౌన్సెలింగ్ తీసుకోవాలి. రోజూ యోగా, ధ్యానం చేయాలి. బరువును నియంత్రణలో పెట్టుకోవాలి. ఏడాదికి ఒకటి, రెండుసార్లు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
డా. కావ్యప్రియ వజ్రాల
కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్.
యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ