CM Vijay : ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లుగా తాను ప్రజలు సొమ్ము ఒక్క పైసా కూడా ముట్టుకోబోనని హామీ ఇచ్చారు తమిళనాడు నూతన సీఎం విజయ్. ఆదివారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయ్ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా తన పాలన గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయబోనని వెల్లడించారు.
‘‘నేను ముందుగా హామీ ఇచ్చినట్లుగా ప్రజల సొమ్ములోంచి ఒక్క పైసా కూడా ముట్టుకోను. ఈ రోజునుంచి డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాను. డ్రగ్స్ బారి నుంచి యువతరాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. శాంతి భద్రతల్ని పరిరక్షిస్తూ, ప్రతి ఒక్కరి భద్రతకు హామీ ఇస్తున్నా. ముఖ్యంగా మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నా. ఈ విషయంలో కొందరు స్నేహితులు, శతృవులు నన్ను ఇబ్బంది పెట్టొచ్చు. కానీ, ఎనిమిది కోట్ల మంది ప్రజలు నావాళ్లే. తమిళనాడు ప్రజలకు హామీ ఇస్తున్నా.. ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయను. నేను డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదు. అది మీ అందరికీ తెలుసు. అవినీతి రాజకీయాల్ని ప్రోత్సహించను.
ఏ ఒక్కరూ అవినీతికి పాల్పడకుండా చూస్తా. మనందరం కలిసి బలమైన, గొప్ప తమిళనాడును నిర్మిద్దాం” అంటూ విజయ్ ప్రసంగించారు. రాష్ట్ర పరిపాలన విభాగం, ఆర్థిక పరిస్థితిని సమీక్షించి త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని విజయ్ వెల్లడించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాజకీయంగా తాను ఎవరినైనా కలవాలి అనుకుంటే రహస్యంగా నాలుగు గోడల మధ్య కలవబోనని, ఏం చెసినా బహిరంగంగా, పారదర్శకంగా చేస్తానని హామీ ఇచ్చారు.