Summer Season | టాలీవుడ్‌కు సంక్రాంతి తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఏదైనా ఉందంటే అది ‘సమ్మర్’. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలకు సెలవులు రావడంతో స్టూడెంట్స్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తుంటారు. స్టార్ హీరోల సినిమాలు, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, కామెడీ చిత్రాలు, యాక్షన్ డ్రామాలు ఈ సీజన్లో విడుదలైతే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు నమోదవుతాయి. గతంలో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు కూడా సమ్మర్ సీజన్లోనే వచ్చాయి.అయితే 2026 సమ్మర్ మాత్రం పూర్తిగా నిరాశపరుస్తోందనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ప్రతి వారం నాలుగైదు సినిమాలు విడుదలవుతున్నా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే స్థాయిలో ఒక్క సినిమా కూడా నిలబడలేకపోయింది. దీంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు వీకెండ్ వస్తే హౌస్‌ఫుల్ బోర్డులతో కనిపించే సినిమా హాళ్లు ఇప్పుడు ప్రేక్షకుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మార్చి నెలాఖరులో భారీ అంచనాల మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆ సినిమా మీద ఇండస్ట్రీ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోయాయి. దాని తర్వాత వచ్చిన బ్యాడ్ బాయ్ కార్తీక్, పాపం ప్రతాప్, గేదెల రాజు కాకినాడ తాలుకా, గాయపడ్డ సింహం, జెట్లీ వంటి చిత్రాలు కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా.. అవి కూడా కలెక్షన్ల రూపంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. బైకర్, రాకాస, డెకాయిట్, తిమ్మరాజుపల్లి టీవీ వంటి సినిమాలు కొంతమేర ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నా.. థియేటర్లకు జనం రావడం మాత్రం పెరగలేదు.
ఇటీవల కాలంలో ఓటీటీ ప్రభావం కూడా థియేటర్లపై తీవ్రంగా పడుతోంది. సినిమా విడుదలైన కొద్ది వారాల్లోనే ఓటీటీలోకి వస్తుందనే భావన ప్రేక్షకుల్లో బలపడింది. దీంతో “థియేటర్‌కు వెళ్లే బదులు ఇంట్లోనే చూస్తాం” అనే ఆలోచన పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు ఇది పెద్ద మైనస్‌గా మారింది.మరోవైపు టికెట్ ధరలు, పార్కింగ్ ఛార్జీలు, ఫుడ్ ఖర్చులు కూడా కుటుంబ ప్రేక్షకులను వెనక్కి నెడుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక కుటుంబం థియేటర్‌కు వెళ్లాలంటే వేల రూపాయలు ఖర్చవుతున్న పరిస్థితి ఉంది. సినిమా కంటెంట్ బలంగా లేకపోతే ప్రేక్షకులు అంత డబ్బు ఖర్చు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.ఇండస్ట్రీ వర్గాలు కూడా ప్రస్తుతం పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకప్పుడు సమ్మర్ సీజన్ అంటే నిర్మాతలకు భారీ ఆశలు ఉండేవి. కానీ ఇప్పుడు అదే సీజన్లో సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతుండటం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు పెద్ద షాక్‌గా మారింది. ముఖ్యంగా థియేటర్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.