మెహిదీపట్నం నవంబర్ 14: తన చావుకు భార్య, అత్తింటి వారే కారణమని వీడియో రికార్డ్ చేసి.. ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. సంతోష్(36), కల్యాణి(32) దంపతులు షేక్‌పేట్ లైబ్రరీ సమీపంలో నివసిస్తున్నారు. సంతోష్ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగం చేస్తూ..కుటుంబాన్ని పోషించేవాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న అరకులో జరిగిన బస్సు ప్రమాదంలో కల్యాణి గాయపడి.. ప్రాణాలతో బయట పడింది. అప్పటి నుంచి ఆమెకు అన్నీ తానై సంతోష్ సేవలు చేశాడు.
ఇటీవల కోలుకున్న కల్యాణి తన తల్లి తరఫు కుటుంబసభ్యులతో కలిసి సంతోష్‌ను అనేక రకాలుగా వేధించడం మొదలు పెట్టింది. ఈ కారణంగా సంతోష్ తన భార్యతో కలిసి పోలీస్‌స్టేషన్ కౌన్సెలింగ్ సెంటర్‌కు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఎంతో పరువుగా బతుకుతున్న తన బతుకును బజారుకీడ్చడం, మూడు సార్లు హత్యాయత్నం చేయడాన్ని జీర్ణించుకోలేని సంతోష్.. శుక్రవారం అర్ధరాత్రి విషం తాగి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, ఆదివారం మధ్యాహ్నం చనిపోయాడు.
‘అమ్మా..క్షమించు, బతకాలని ఉంది.. కానీ కల్యాణి వేధింపులు భరించలేక.. చనిపోవాలనుకుంటున్నా..బాబు అభిరామ్.. నన్ను క్షమించు’.. అని సంతోష్ ఆత్మహత్యకు ముందు సెల్ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడు. తన చావుకు భార్య కల్యాణి, అత్త అరుణ, మామ పండరీనాథ్, బావమరిది గణేశ్, కల్యాణి బాబాయి భీమ్ కారణమని పేర్కొన్నాడు. వీరందరికీ కఠిన శిక్ష పడేలా చూడాలని తన సోదరుడు అన్వేశ్‌ను కోరాడు. ఇదిలా ఉండగా, తన సోదరుడు సంతోష్ మృతికి కారణమైన వదిన కుటుంబసభ్యుల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని మృతుడి సోదరుడు అన్వేశ్ ఆందోళన వ్యక్తం చేశాడు.