దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. రష్మిక మందన, సమంత, గౌతమ్ మీనన్‌లు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో స్వప్న సినిమాస్ పతాకంపై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఫీల్‌గుడ్ ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల అభినందనలు పొందింది. బాక్సీఫీస్ వద్ద కూడా ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ అవార్డుల్లో ఈ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా లేదా జాతీయ అవార్డుల్లోనైనా కొన్నివిభాగాలకు ఎంపిక అవుతుందని అందరూ ఆశించారు. అయితే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తీకేయ-2ను ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
సాధారణంగా సీక్వెల్స్‌కు ఇంతకు ముందున్న నిబంధనల ప్రకారం అవార్డులు ఇచ్చే వారు కాదు. కానీ ఇప్పుడు నూతన నిబందనల ప్రకారం కార్తీకేయ-2 అవార్డు దక్కించుకుందని తెలిసింది. ఆర్మీ నేపథ్యంలో కొనసాగే ఓ పీరియాడికల్ లవ్‌స్టోరీగా సీతారామంను తెరకెక్కించిన తీరు ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని పంచింది.
సీత, రామ్‌ల ప్రేమ ప్రయాణం, వారి స్వచ్చమైన మనసు, ఇద్దరూ కలిశాక దగ్గరయ్యే విధానం, ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా అనుబంధం ఈ భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని బరువెక్కించాయి.
మొత్తంగా సీతారామం ప్రతి హృదయాన్ని హత్తుకుంది. ఇలాంటి చిత్రానికి అవార్డు వరించకపోవడంతో కొంత మంది నిరాశ చెందారు. సోషల్‌మీడియాలో కూడా సీతారామం అవార్డు టాపిక్ కొనసాగుతుంది. అయితే అవార్డు కంటే మించిన ప్రశంసలు సీతారామం దక్కాయనేది మరికొంత మంది అంటున్నారు.