హైదరాబాద్, మే 25 (నమస్తేతెలంగాణ): ‘పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పేరిట రూ.32 చొ ప్పున కొల్లగొడుతూ సీఎం కేసీఆర్ పేదల రక్తం పీల్చుతున్నారు’ అని నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఆరోపణలు గుప్పించారు. నాడు ఎమ్మెల్యే గా సీతక్క పెట్రల్ అవుట్లెట్లను సందర్శించి ధరల లెక్కలు వివరిస్తూ, వ్యాట్ తగ్గించాలని రీల్స్ చేస్తూ సోషల్ మీడియలో ఊదరగొట్టా రు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, సీతక్క మంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. 11 రోజులుగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నాలుగు సార్లు పెట్రో ధరలు పెంచుతూ ప్రజలపై పెద్ద ఎత్తున భారం మోపింది. ఇప్పడు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్‌పై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేసి న అదే రేవంత్.. ముఖ్యమంత్రిగా అధికారం లో ఉండి మౌనం వహించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడెందు కు మౌనం దాల్చుతున్నారని బీఆర్ఎస్, వామపక్షాలు, పలు ప్రజా సంఘాలు నిలదీస్తున్నా యి. సోషల్ మీడియాలో సీఎం రేవంత్, మంత్రి సీతక్క మాట్లాడిన ఆనాటి వీడియోలను వైరల్ చేస్తూ సెటైర్లతో నెటిజన్లువిరుచుకుపడుతున్నారు. వెంటనే వ్యాట్ తగ్గించి పేదలపై ఉపశమనం కలిగించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్తోపాటు సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
అందరూ ఊహించినట్టుగానే ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఇంధన ధరలను వరుస గా పెంచుతూ ప్రజలపై కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ విరుచుకుపడుతున్నది. 11 రోజుల్లో ఏకంగా నాలుగుసార్లు ఇంధన ధరల పిడుగువేసింది. తాజాగా సోమవారం పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున వ డ్డించింది. 11 రోజుల్లో పెట్రోల్, డీజిల్‌పై రూ.7కు పైగా భారం మోపింది. దేశవ్యాప్తంగా పెట్రో ధరల పెంపుతో వినియోగదారుల్లో ఆగ్ర హం పెల్లుబుకుతున్నది. మే 15న దేశవ్యాప్తం గా పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.3, సీఎన్జీపై రూ.2 చొప్పున కేంద్రం ధరలు పెంచింది. ఆ తర్వాత మే 19న పెట్రోల్‌పై 95 పైసలు, డీజిల్‌పై 99 పైసలు, మే 23న పెట్రోల్, డీజిల్‌పై 97 పైసల చొప్పున, తాజాగా మే 25న పెట్రోల్‌పై 2.84 పైసలు, డీజిల్‌పై 2.86 పైసల చొప్పున పెంచి ప్రజలకు షాక్ ఇచ్చింది. నాలుగు విడతల్లో పెట్రోల్‌పై రూ.7.76, డీజిల్‌పై రూ.7.82 చొప్పున పెంచింది. పెరిగిన ధ రలతో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.11 5.69, డీజిల్ ధర రూ.103.82కు చేరింది.
పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరల పెంపుతో తెలంగాణ ప్రజలపై పెనుభారం పడనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 3,000 అవుట్లెట్ల ద్వారా రోజూ 75 లక్షల లీటర్ల డీజిల్, 50 లక్షల లీటర్ల పెట్రోల్‌ను విక్రయిస్తున్నారు. లీటర్‌పై సగటున రూ.7 చొప్పున పెంచడంతో రోజూ సుమారు రూ.4 కోట్లు, నెలకు రూ.300 కోట్ల అదనపు భారం పడనున్నదని తెలంగాణ సివిల్ సైప్లె శాఖ అధికారులు వెల్లడించారు.
ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసరా ల ధరలు పెరిగే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 15 రోజుల క్రితం పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, నాలుగుసార్లు పెరిగిన ఇంధన ధరలు పెనుభారంగా మారనున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. త్వరలో సాగు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పెట్రో ధరల పెరుగుదల శరాఘాతంగా మారనున్నదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ట్రాక్టర్లు, యంత్ర పరికరాలను వినియోగించే రైతులు పెట్రో ధరల భారం తప్పదని మదనపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం దారుణమని ఇసుక లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ అన్నారు. ఒకే నెలలో మూడుసార్లు ఇంధన ధరలు పెంచడంవల్ల రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతున్నదన్నారు. నిత్యావసర ధరలు పెరిగితే పేదలపై మోయలేని భారం పడుతుందని పేర్కొన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు.