అందమైన కానుక.. అంతకంటే అందమైన కథలు చెప్పాలి. అవ్యక్త భావాలను అవతలి వారి చెవిలో గుసగుసగా వినిపించాలి. తీపి బాసలను మరొక్కసారి గుర్తుచేయాలి. ఇద్దరికే పరిమితమైన జ్ఞాపకాలను గుదిగుచ్చినట్టు వివరించాలి. కాబట్టే, డిజైనర్లు హృదయాకారంలో వైవిధ్యమైన ఆభరణాలను తయారు చేస్తున్నారు. ప్రేమ నిత్యనూతనమని పరోక్షంగా చాటుతున్నారు. ప్రేమ కానుకల్లో గులాబీ తర్వాతి స్థానం నగలదే. హృదయాకారంలో ఒదిగిన ఉంగరాలు, పెండెంట్లు, కమ్మలు, గొలుసులు తిరుగులేని బహుమతులుగా మారిపోయాయి. వేయి ప్రేమలేఖల సౌందర్యాన్నిఓ నగలో పొదుగుతున్నాయి.
ఎరుపు.. మెరుపు
ప్రేమికులకు ప్రకృతి ప్రసాదించిన కానుక ఎర్ర గులాబి. మగువకు పువ్వులంటే ఎంత ఇష్టమో.. బంగారమన్నా అంతే మక్కువ. దీంతో, ప్రేయసికి గులాబీ డిజైన్ల స్వర్ణాభరణాలను కానుకగా ఇస్తున్నారు ప్రియ మజ్నూలు. హృదయాకార ఎరుపు రత్నాలు, రాళ్లు పొదిగిన ఉంగరాలు, పెండెంట్లకు వాలెంటైన్స్ మాసంలో భలే గిరాకి! ఎండబెట్టిన రోజాపూల రెక్కలను గాజు మూత ఉన్న బంగారు లాకెట్లో అమర్చి విక్రయిస్తున్నాయి కొన్ని సంస్థలు. స్వర్ణకాంత గులాబీ రేకులను వస్త్రంలా ఒంటికి చుట్టుకున్నట్టు ఉంటుంది.. రోజ్ గోల్డ్. ఆ రంగు మీద ప్రేమతో రోజ్గోల్డ్ ఆభరణాలను కాంతామణికి సమర్పిస్తున్న వారూ ఉన్నారు. ‘వజ్రంలానే మన ప్రేమ కూడా ఎప్పటికీ నిలిచే ఉంటుంది’ అని చాటి చెప్పడానికి కావచ్చు.. వజ్రాల నెక్లెస్లు, ఉంగరాలు ప్రేమ కానుకగా సమర్పించే మిస్టర్ రొమాంటిక్లకు కొదవే లేదు.
లవ్ బ్యాండ్స్..
ప్రేమికులిద్దరూ ఒకే రకమైన ఉంగరాలు, బ్రేస్లెట్స్ ధరిస్తుంటారు. వీటిలో ఎదుటి వ్యక్తుల పేర్లను తెలిపే అక్షరాలే ఎక్కువ. కొందరైతే ‘మై లవ్’,‘మై లైఫ్’ అన్న క్యాప్షన్స్తో ఎదలోతుల్లోని భావనలనూ జతచేస్తారు. బంగారంతోపాటు వెండి, ప్లాటినమ్ లవ్ బ్యాండ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. హృదయాకార ఆభరణాలను హృదయా కారపు పెట్టెలో పెట్టి హృదయపూర్వకంగా అందిస్తే.. జీవితమంతా ప్రేమమయమే!
సకల.. వర్ణాల్లోనూ
నిజానికి ప్రతి రంగు వెనుకా ఓ కథ ఉంటుంది. అంతర్లీన సందేశమూ ఉంటుంది. తెలుపు ప్రశాంతతకు, శాంతికి చిహ్నం. ‘జీవితాంతం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా, ప్రశాంతంగా బతుకుదాం’ అన్న సందేశంతో తెలుపు రంగు రాళ్లు పొదిగిన ఆభరణాలు కానుకగా ఇచ్చేవారూ ఉన్నారు. వైట్ గోల్డ్ నగలకు ఈ సీజన్లో గిరాకీ ఎక్కువే. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఇచ్చిపుచ్చుకునే కానుకల్లో లేత నీలంరంగువి (లావెండర్) మొదటి స్థానంలో ఉంటాయి. అందుకే ఈ వర్ణానికి‘వాలెంటైన్ కలర్’ అని పేరు. ఈరంగు లోని గులాబీని‘వాలెంటైన్ ఫ్లవర్’ అంటారు.