ఫ్రెంచి లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ‘చానెల్’ కొత్త ముఖ్య కార్య నిర్వహణ అధికారి (సీఈఓ)గా లీనా నాయర్ (52) ఎంపికయ్యారు. ఆమె ఇంతవరకు యూనిలీవర్లో మానవ వనరుల (హెచ్ఆర్) విభాగం ఎగ్జిక్యూటివ్‌గా సేవలు అందించారు. ఈ నియామకంతో గ్లోబల్ సంస్థల్లో ఉన్నత స్థానాలను ఆక్రమించిన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తుల జాబితాలో లీనా నాయర్ కూడా చేరిపోయారు. లీనా లండన్ కేంద్రంగా సేవలందించనున్నారు. 1992లో యూనిలీవర్లో మేనేజ్మెంట్ ట్రెయినీగా లీనా నాయర్ తన కెరీర్‌ను ప్రారంభించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించిన నాయర్ సాంగ్లిలోని వాల్చంద్ కాలేజీలో ఇంజినీరింగ్ చదివారు. 1992లో జంషెడ్‌పూర్‌లోని ఎక్స్ఎల్ఆర్ఐ నుంచి హ్యూమన్ రిసోర్సెస్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. పెప్సికో మాజీ చీఫ్ ఇంద్రా నూయి తర్వాత, ఒక సంస్థకు సీఈఓ పదవి దక్కించుకున్న భారతీయ మూలాలు ఉన్న రెండో మహిళ లీనా నాయర్.