Electric Scooter Battery | ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంపిక చేసేటప్పుడు అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి అది ఉపయోగించే బ్యాటరీ రకం. సరైన బ్యాటరీ ఉంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు, పనితీరు మెరుగ్గా ఉంటుంది, అలాగే బ్యాటరీపై ఆందోళనలు కూడా తగ్గుతాయి. అసలు మార్కెట్లో ఎన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీలు ఉన్నాయి, ఏవి ఎలాంటి పనితీరును అందిస్తాయి, హీట్‌ను ఎంత తట్టుకుంటాయి, చార్జింగ్ కెపాసిటీ, లైఫ్, మైలేజ్ వంటి విషయాల్లో చాలా మందికి అవగాహన ఉండడం లేదు. ఈ క్రమంలోనే నిపుణులు ఆయా వివరాలను వెల్లడిస్తున్నారు. వీటిని బట్టి ఎలాంటి బ్యాటరీ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనాలో వినియోగదారులకు చాలా సులభంగా అర్థమవుతుంది.
ప్రస్తుతం చాలా వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు లేదా మోటార్ సైకిళ్లలో లిథియం అయాన్ బ్యాటరీని అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది తక్కువ బరువు ఉంటుంది. ఎక్కువ శక్తిని ఇస్తుంది. మైలేజ్ కూడా ఎక్కువగానే వస్తుంది. బ్యాటరీ లైఫ్ సుమారుగా 1వేయి నుంచి 2వేల సైకిల్స్ వరకు వస్తుంది. అలాగే హీట్‌ను గరిష్టంగా 60 డిగ్రీల వరకు తట్టుకుంటుంది. అందువల్ల చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ తరహా బ్యాటరీలనే అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇక మరో బ్యాటరీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ లేదా ఎల్ఎఫ్పీ. ఇది ప్రీమియం రకానికి చెందినది. లిథియం అయాన్ బ్యాటరీ కన్నా ఇది మరింత మెరుగ్గా పనిచేస్తుంది. ఇంకా తేలిగ్గా ఉంటుంది. అధిక శక్తిని అందిస్తుంది. అలాగే మైలేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ సుమారు 2వేల నుంచి 3వేల సైకిల్స్ వరకు వస్తుంది. హీట్‌ను కూడా లిథియం బ్యాటరీ కన్నా అధికంగా తట్టుకుంటుంది. అయితే ఆ బ్యాటరీలతో పోలిస్తే ఎల్ఎఫ్పీ బ్యాటరీల ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ దీర్ఘకాల మన్నిక, బ్యాటరీ లైఫ్, హీట్, మెరుగైన మైలేజ్ వంటి విషయాల్లో లిథియం అయాన్ కన్నా ఎల్ఎఫ్పీ పైచేయి సాధిస్తుంది.
ఇక ఎలక్ట్రిక్ స్కూటర్లలో వాడే మరో రకం బ్యాటరీ లెడ్ యాసిడ్. సాధారణంగా ఒక మోస్తరు నుంచి అంతగా పేరు లేని కంపెనీలు తమ మోడల్స్‌లో ఈ బ్యాటరీలను ఉపయోగిస్తుంటాయి. ఇవి చాలా తక్కువ రేంజ్‌ను అందిస్తాయి. బ్యాటరీ లైఫ్ కూడా తక్కువగానే ఉంటుంది. ధర తక్కువే అయినప్పటికీ హీట్‌ను అంతగా తట్టుకోలేవు. బ్యాటరీ లైఫ్ సైకిల్స్ కూడా 1వేయికి లోపే ఉంటాయి. ఈ తరహా బ్యాటరీలు ఉన్న స్కూటర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీటిని ఎక్కువ సేపు ఎండలో ఉంచినా లేదా హీట్‌కు గురైనా త్వరగా పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఉన్న స్కూటర్లను కొనేవారు కాస్త ఆలోచించాల్సి ఉంటుంది.
సాధారణంగా చాలా వరకు బ్రాండెడ్ కంపెనీలు తమ స్కూటర్లు లేదా ఇతర ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం అయాన్, ఎల్ఎఫ్పీ బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. అందువల్ల కాస్త ధర ఎక్కువే అయినప్పటికీ సేఫ్టీ పరంగా ఉత్తమ ప్రదర్శనను అందిస్తాయి కనుక ఈ బ్యాటరీలు ఉన్న వాహనాలను కొనుగోలు చేస్తే ఉపయోగం ఉంటుంది. బ్యాటరీ విషయంలో ఆందోళన చెందాల్సి అవసరం ఉండదు. దీర్ఘకాల మన్నిక, ఎక్కువ రేంజ్, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి. ఇక చాలా వరకు ఎల్ఎఫ్పీ బ్యాటరీలు ఉన్న స్కూటర్లు సుమారుగా 200 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇస్తాయి. వేరియెంట్‌ను బట్టి కూడా ఇది మారుతుంది. లిథియం అయాన్ బ్యాటరీ అయితే సుమారుగా 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. అదే లెడ్ యాసిడ్ బ్యాటరీ అయితే కేవలం 50 నుంచి 70 కిలోమీటర్ల రేంజ్‌ను మాత్రమే ఇస్తాయి. అందువల్ల వ్యక్తిగత అవసరాలు, స్థోమతకు అనుగుణంగా ఆయా బ్యాటరీలు ఉన్న వాహనాలను ఎంపిక చేసుకోవచ్చు. అయితే బ్యాటరీ విషయంలో ఆందోళన ఉన్నవారు మాత్రం ఎల్ఎఫ్పీ లేదా లిథియం అయాన్ వైపు మొగ్గు చూపితే మంచిది. ఇవి లెడ్ యాసిడ్ బ్యాటరీల కన్నా ఎక్కువ సేఫ్టీని అందిస్తాయి.