మొదలు రాగం మారింది
మనుషులు మారడం తరువాత
పాత గోడల మీది నినాదాలకు
రంగుల అద్దకం మొదలవుతుంది
ఊరు కొత్త భాషను వెతుక్కున్నది
జువ్వి చెట్టుమీద లేవు కొంగలు
జెండాల తలలు నిక్కినిక్కి చూస్తున్నై
తొవ్వ నిండా కుక్కలు పసిగట్టని అడుగులు
ఋతువులను బట్టి విప్పే స్వరాలు
ఇప్పుడు కవాతుల నడుమ కాటగల్సిన
పురా దుఃఖం
సందర్భం పావురాల గుంపు
ఎగిరిపోకడను
వేలెత్తి చూపెడుతున్నది
ఒకప్పుడు ఊరు సుగంధపరిమళ కోన, చెరుకు తీపి
ఇప్పుడు డిస్టిలరీలో ముంచి తీసిన ఏదో మత్తువాసన
తీగల్లా అల్లుకున్న ప్రేమలు
ఇనుప గొలుసుల చేతులతో
చట్టం ముందు వంచిన తలతో
ఊరు ఆలోచన చింత చెట్టుకు
వేలాడుతున్న గబ్బిలంలా
తిర్రమర్ర అయ్యింది
పందిరి తీగల కింది కాయల్ని మోస్తున్నట్టు
మనుషుల్ని మోసిన ఊరు
నువ్వేంటి అని విషాద ప్రశ్న వేస్తున్నది .