బండబారిన ఈ సమాజానికి సుతిమెత్తని చురకలంటించిన కవితలు అతనివి. ఉన్నతమైన భావాలతో, ఉత్తేజితమైన ఆలోచనలతో, కొంగ్రొత్త వాక్యాలతో, అద్భుతమైన కావ్యాలను రాసిన కలం అతనిది. అతనే.. సునిశితమైన చూపు, సులక్షణమైన కవితా నేర్పు ఉన్న మన ‘గన్ను కృష్ణమూర్తి’.
వరంగల్ జిల్లా నెక్కొండలో గన్ను వైకుంఠం, జగదాంబ దంపతులకు 1945 సెప్టెంబర్ 2న జన్మించిన ఈ కవిమూర్తి చిన్నప్పటి నుంచే సాహిత్యంపై విపరీతమైన అభినివేశం ఉన్నవారు. తాను చూసిన సమాజంలో ఎదురైనది, ఎదుర్కొన్నది, తన అనుభవాల పుటలతో అల్లుకున్నదంతా పుస్తకాల రూపంలో అందించారు.
పాఠశాల స్థాయిలోనే ఆగిపోతుందనుకున్న ఆయన చదువు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ దాకా సాగింది. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఉపన్యాసకునిగా ఎంతోమంది విద్యార్థులకు తన బోధన ద్వారా ఆయన జ్ఞానప్రసూనాలను అందించారు.
కవిగా, కథారచయితగా, గొప్ప పరిశోధకుడిగా, సాహితీ విమర్శకుడిగా, సంపాదకుడిగా బహుముఖీనమైన ప్రతిభాపాటవాలతో ఆయన సాహితీ విశ్వరూపం మనకు కనబడుతుంది. తన కండ్ల ముందు జరిగినదంతా నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా కవితగా ఆయన రాసేవారు. రామాయణ, భారత, భాగవతాలను విస్తృతంగా, లోతుగా ఆయన అధ్యయనం చేశారు. వాటిలోని నీతులను, తాత్త్వికతను, పరమార్థాన్ని మన నిజజీవితాలకు ఎలా అన్వయించుకుని అర్థం చేసుకోవాలో చెప్పారు.
ఆయన కవిత్వం 1978లో ‘అడవిపూలు’తో మొదలైంది. ఆ తర్వాత-‘ఈ మట్టి నన్ను వెళ్ళనీదు’ (1992), ‘కృష్ణవేదం’ (పద్యాలు-1992), ‘అంతరంగం’ (మినీకవిత-1978), ‘వాసవి-మహాసంకల్పం’ (గేయకావ్యం-1992), ‘కత్తుల కౌగిలి’ (ప్రతీకాత్మక గేయకావ్యం)-1995), ‘కాకిలో కాకినై! తోకలో ఈకనై’ (పేరడీలు-2014) వంటి కవితా సంపుటాలు వెలువరించారు.
అదేవిధంగా ‘తపస్సు’ (1998) వంటి కథలు, ‘మహాప్రభంజనం’ (2003), ‘యార్లగడ్డ వారి వస్ర్తాపహరణం’ (2010) వంటి సాహిత్య విమర్శనా గ్రంథాలు రాశారు. అలాగే ‘రాముడంటే ఎవరు? రామాయణమంటే ఏంది?’ (2009), ‘రుషి హృదయం’ (2010) వంటి పరిశోధనా గ్రంథాలు, ‘అభిలేఖనం’, ‘కోటిగొంతుకలు’ వంటి పుస్తకాలకు సంపాదకత్వం..ఆయన రచనల్లో కొన్ని. ఆయన రాసిన ‘శ్రీకృష్ణ రమ్యరామాయణం’ ఆయనలోని లోతైన ప్రతిభకు తార్కాణం.
‘అది ద్వారక నగరమ్ము-అది
ద్వాపర యుగాంతమ్ము
అలలలోన కలలతోడ-వెలసెనొక్క ద్వీపమ్ము
నగరమ్మే సాగరమన-
అగుపించును ద్వారక
ఉరకల పరుగుల దేలేడు-
నరులె తరంగాలనంగ’
అంటూ ఈ కావ్యంలో శ్రీకృష్ణావతారం రసరమ్యంగా, రమ్యేతిహాసంగా వర్ణితమై సాగుతుంది. శబ్దసౌందర్యం, భావసౌకుమార్యం అద్భుతంగా కనిపిస్తుంది. రమణీయమైన గేయఛందస్సులో అనితర సాధ్యంగా ఆపాత మధురంగా ఈ కావ్యం రాశారు.
‘అబ్జములకున్ను నెయ్యమ్ము అబ్జునకు లేదు లేదంద్రునిజమది కాదొయేమొ?’ కాంత నీ యిందు వదనమ్ము కాంచు నంత నాదు హృదయమ్ము వికసించు నళినివోలె’ అంటూ గోపికాకృష్ణుల సంభాషణ ను మధురాతిమధురంగా ఆయన వర్ణిస్తారు.
మినీకవిత్వ రచనలో ఆయనకు ఆయ నే సాటి. ప్రతి మనిషిని సున్నితంగా ప్రశ్నించి, అతనిలో ఆలోచనల్ని రేకెత్తించి, తనను తాను సరిదిద్దు కునేలా ప్రబోధాత్మకమైన వాక్యాలతో ఆయన మినీకవిత్వాన్ని రాశారు.
‘వర్గసంఘర్షణ కాదు, అంతఃసంఘర్షణ కావాలి మనిషికి కూడూ, గూడూ గుడ్డే కాదు మనిషిని మహోత్కృష్టునిగా మలచే ఆశయం కావాలి చలికాలం మంటలు కాదు కవిత్వం కలకాలం నిలిచేదే కవిత్వం’ పై పంక్తులు మనల్ని ఆలోచింపజేస్తాయి. ‘చెత్తకుప్పల్లో వెదుకుతున్నాను అగ్గిపుల్ల కోసం ఆ చెత్తను తగలేయడానికి’
అనే వాక్యాలు పాఠకుల్ని బాగా ఆలోచింపజేస్తాయి. ప్రగతివైపు ప్రయాణించేలా ప్రబోధిస్తాయి. 2022 సెప్టెంబర్ 9న ఆయన పరమపదించారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా, తన రచనలతో ఆయన చిరంజీవిగా నిలిచే ఉంటారు.