హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): గుజరాత్‌లోని ఏక్తానగర్ (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) వద్ద జరుగనున్న రెండురోజుల చింతన్‌శివిర్-2026 వర్ షాప్‌నకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బృందం బయల్దేరి వెళ్లింది. కేంద్రమంత్రి నితిన్ గడరీ అధ్యక్షతన ఈనెల 5,6 తేదీల్లో ఈ సదస్సు జరుగనున్నది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్అండ్బీ మినిస్టర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఈ పర్యటనలో మంత్రి వెంట ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, పలువురు చీఫ్ ఇంజినీర్లు ఉన్నారు. పీఎం గతిశక్తి, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో కేంద్రం-రాష్ట్రాల సమన్వయంపై అన్ని రాష్ర్టాల మంత్రులతో ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపై కేంద్రమంత్రి నితిన్ గడరీతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేకంగా చర్చించనున్నారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్డు, ఎన్‌హెచ్-65 విస్తరణ, ఎల్బీనగర్ డబుల్ డెకర్ ఎలివేటెడ్ కారిడార్, భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే సాధనపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.