Wandering between two worlds; One dead, and the other powerless to be born … అంటరు Stanzas from the Grande Chartreuseలో 19వ శతాబ్దపు ఆంగ్ల కవి మా థ్యూ ఆర్నాల్డ్. కవులు అంతేనేమో! మృతప్రాయమైన విలువలు, పునరుజ్జీవింప శక్తిలేని స్థితుల మధ్య పరిభ్రమిస్తూ, సంఘర్షిస్తూ ఉంటరు. ఆ సంఘర్షణలోంచే నూరు పూలు వికసిస్త్తయి.
మాథ్యూలాగా మనకూ ఉన్నారు ఆలూరి బైరాగి. ఆయన ‘నూతిలో గొంతుకలు’ నిండా నిర్వేదమే. నిర్వేదం నేనేమీ negetive conno tationలో వాడటం లేదు. నిర్వేదమూ ఒక యోగమే ‘అర్జున విషాదయోగం’లా! వినిపించని స్వరాలను మన గమనింపునకు తేవడం; అసలు స్వరాలుగా కూడా లేని మౌనవేదననూ మనకు పట్టివ్వడం సుకవి చేసే పని. ‘నగ్న వృక్షం’ కవి పాశం వెంకటేశ్వరరెడ్డి మాథ్యూ, బైరాగిలను గుర్తుకు తేవడం సబబే.
అందాన్ని, అలంకరణను /
ముస్తాబును, ముచ్చటను
అన్నిటినీ తనకొదిలేసిన వృక్షానికి / వసంతం ఎన్నటికీ మోసం చేయదు
కృష్ణశాస్త్రి ‘వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంతమాసం’ గుర్తుకు వచ్చింది ‘నగ్న వృక్షం’లోని ఈ
ఎదురుచూపు!
దిగంతంలో ఇరుకుపడి
అస్తమిస్తున్న సూర్యుడి చుట్టూ
మొహాలెర్రజేసుకుని నిలబడ్డ మేఘాలను
అంటరు ‘సముద్రంలో ఎండమావి’లా!
మనం జీవితంలో ఎన్నో లక్ష్యాలను వెంటాడుతం. అవి దగ్గరగా కనిపిస్తయి; కానీ చేరుకునే సమయానికి మరింత దూరమవుతయి, చాలాసార్లు మాయలుగా మారిపోతయి. మనిషి నిజమైన పోరాటం బయట ప్రపంచంతో కాదు, తన అంతర్మనస్సుతోనే జరుగుతుంది.
వెంకటేశ్వరరెడ్డి విలువల పతనాన్ని ప్రశ్నిస్తరు, subtleగానే కానీ గట్టిగా! నిజాయితీ లుప్తమవుతూ సంబంధాలు కేవలం లావాదేవీలుగా మారుతున్నాయన్న ఆవేదన ఆయనది. ఆయన నిరాశావాది కాదు; ఆశ ఉంది , కానీ అది స్పష్టంగా కనిపించదు. ఆయనకే ప్రశ్నలు ఉన్నయి. ఈ ఆలోచనలు నిజంగా ఏమైనా మార్పు తీసుకువస్తాయా? అని. ఇలాంటి ప్రశ్నలు చదువరులను మథనంలో పడేయాలి. అలజడి, సంఘర్షణ జరగాలి. రాపిడి పెడితేనే కదా రవ్వ విలువ తెలిసేది.
‘కోరిక ఉన్నంతసేపే మనం
దివ్యులం, పూజ్యులం
శరీరం, ఆహార్యం, అహంకారం
అన్నీ మన అంతఃచేతనకు గవాక్షాలు’
ఇది యాంటీ-బుద్ధిజంలా అనిపించింది వెంటనే. కానీ కాదు. ఆయన దేనికీ యాంటీకాదు; దేనికీ ఫర్ కాదు. అట్లని, ఉన్మత్తుడు కాదు, డిటాచ్మెంట్ కూడా తెలిసినవాడు. సమూహంలోనూ ఒంటరి!
‘చిలికితే కవ్వానికి చుట్టుకునే వెన్నలాగ
జనంలో కలివిడిగా తిరిగితే హృదయానికి చుట్టుకునే ఒంటరితనం’
అంటరు అందుకే!
‘ఈ శిలలకూ హృదయముండి తీరాలి
లేకుంటే ఎందుకు పగులుతాయి?’
రాయీ రప్పలను కూడా ఇంత ప్రేమిస్తరా ఎవరైనా?! నా పిచ్చిగానీ… ప్రేమకు తరతమ, స్థాయీ భేదాలు ఉంటయా! ఓ షో అంటరు కదా: నేను ఎవరినీ ప్రేమించను. ఎందుకం టే ప్రేమ ఒక ఉద్యోగం కా దు, పనిగట్టుకుని చేయడాని కి. ప్రేమ నాలో ఉంది, అది ప్రవహిస్తుంది. అట్లా పారే ప్రేమ ప్రవాహం పాశం వెంకటేశ్వరరెడ్డి కవిత్వం.