Zohran Mamdani | న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani) సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున ఘన విజయం సాధించి అమెరికాలోనే అత్యంత ముఖ్యమైన నగరానికి మేయర్గా ఎన్నికయ్యారు జోహ్రాన్ మమ్దానీ. ఈ విజయం ద్వారా జోహ్రాన్ మమ్దానీ రెండు అరుదైన రికార్డులు సృష్టించాడు. న్యూయార్క్ నగర మేయర్ పదవిని చేపట్టిన మొట్టమొదటి ముస్లిం వ్యక్తిగానే కాకుండా.. మొదటి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా రికార్డును అందుకున్నాడు.
కేవలం 34 ఏళ్ల వయస్సులోనే మమ్దానీ మేయర్గా ఎన్నిక అవ్వగా.. గత వంద సంవత్సరాలలో న్యూయార్క్ నగరంలో అత్యంత పిన్న వయస్కుడైన మేయర్గా రికార్డును సృష్టించాడు. మమ్దానీ ప్రగతిశీల విధానాలు, నిత్యావసరాల ధరలు, జీవన వ్యయంపై దృష్టి సారించడం యువతను, సామాన్య ప్రజలను ఆకర్షించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ ఎన్నికపై దృష్టి పెట్టి మమ్దానీని విమర్శించినప్పటికీ యువ ఓటర్లు ఆయనకే పట్టం కట్టడం విశేషం.
అయితే జోహ్రాన్ మమ్దానీ ఎవరో కాదు. ప్రముఖ భారతీయ దర్శకురాలు మీరా నాయర్ కోడుకే ఈ మమ్దానీ. ఉగాండా విద్యావేత్త, రచయిత అయిన మహమూద్ మమ్దానీ, దర్శకురాలు మీరా నాయర్ దంపతులకు జోహ్రాన్ జన్మించారు. ఒడిశాలోని రూర్కెలాలో జన్మించిన మీరా నాయర్ తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడింది. అనంతరం దర్శకురాలిగా సినీ రంగంలోకి అడుగులు వేసింది మీరా. కామ సూత్ర(Kama Sutra), మిస్సిస్సిపి మాసాలా(Missisipi Masala), ది నేమ్ సేక్(The Name Sake), సలామ్ బాంబే, మానుసూన్ వెడ్డింగ్ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో విమర్శల ప్రశంసలు అందుకుంది మీరా నాయర్. భారతీయ సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2012లో ఆమెను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.