న్యూయార్క్: భారతీయ సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ మరికొన్ని గంటల్లో నేలపై దిగనున్నది. 286 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న ఆ వ్యోమగామితో పాటు విల్మోర్(NASA Astronauts) కూడా ఇవాళ అంతరిక్ష కేంద్రం నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు.. జూన్ 5, 2024లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా వాళ్లు ఆ ప్రయాణం చేపట్టారు. కానీ టెక్నికల్ సమస్య రావడంతో.. 8 రోజుల కోసం వెళ్లిన ఆ జంట.. 9 నెలల పాటు అక్కడే చిక్కుకున్నది.
They’re on their way! #Crew9 undocked from the @Space_Station at 1:05am ET (0505 UTC). Reentry and splashdown coverage begins on X, YouTube, and NASA+ at 4:45pm ET (2145 UTC) this evening. pic.twitter.com/W3jcoEdjDG
— NASA (@NASA) March 18, 2025
బోయింగ్ స్టార్‌లైనర్ ఓ కొత్త వ్యోమనౌక. దాన్ని పరీక్షించే ఉద్దేశంతో ఆస్ట్రోనాట్లను నింగికి పంపారు. కానీ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన తర్వాత స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. హీలియం లీకైంది. థ్రస్టర్లు సరిగా పనిచేయలేదు. దీంతో రిటర్న్ జర్నీకి స్టార్‌లైనర్ సురక్షితం కాదని తెలిసింది. ఇక ఆ వ్యోమగాములు లేకుండానే స్టార్‌లైనర్ వ్యోమనౌక భూమ్మీదకు తిరిగి వచ్చింది. రెండు నెలల గ్యాప్ తర్వాత ఆగస్టులో .. ఆస్ట్రోనాట్స్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. స్పేస్ఎక్స్ ద్వారా మార్చిలో ఆ ప్రయత్నం చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఆ సమయంలో విలియమ్స్, విల్మోర్లు.. అంతరిక్ష కేంద్రంలో అధ్యయనంలో మునిగిపోయారు. స్పేస్‌వాక్‌లు చేశారు. వీడియో కాల్స్ మాట్లాడారు. అంతరిక్ష జీవనం గురించి పిల్లలను ఎడ్యుకేట్ చేశారు. ఇప్పుడు స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఆస్ట్రోనాట్లు తిరుగు ప్రయాణం అవుతున్నారు. సునీతా, విల్మోర్తో పాటు మరో ఇద్దరు కూడా ఆ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఇంటికి వచ్చేస్తున్నారు.
నాసా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యా కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బనోవ్ డ్రాగన్ క్యాప్సూల్‌లో రానున్నారు. ఆ ఇద్దరూ సెప్టెంబర్‌లో ఆర్నెళ్ల మిషన్ కోసం స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే డ్రాగన్ క్యాప్సూల్‌లో నలుగురు కూర్చునే చోటు ఉంది. ఆర్నెళ్లు పూర్తి కావడంతో.. సునీతా, విల్మోర్తో పాటు ఆ ఇద్దరు కూడా రిటర్న్ జర్నీకి రెఢీ అయ్యారు. గ్రీన్విచ్ టైం ప్రకారం ఇవాళ రాత్రి 10 గంటలకు డ్రాగన్ క్యాప్సూల్ భూమిపై దిగుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4 గంటలకు సునీతా నేలపై వాలనున్నది.
సాధారణంగా ఆస్ట్రోనాట్స్ ఆర్నెళ్లు మాత్రం స్పేస్ స్టేషన్లో ఉంటారు. కానీ విల్మోర్, సునీతా.. 9 నెలలు ఉన్నారు. దీంతో వాళ్ల శరీరాలపై అంతరిక్ష ప్రభావం ఎక్కువగా పడనున్నది. ఐఎస్ఎస్లో ప్రతి రోజు కొన్ని గంటల పాటు వ్యాయామం చేసినా.. భారరహిత వాతావరణం వల్ల.. వాళ్లు బోన్ డెన్సిటీ కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఎముకలు పలుచనయ్యే ఛాన్సు ఉంది. శరీర మాంసం కూడా తగ్గే అవకాశం ఉన్నది. గురుత్వాకర్షణ ప్రభావం వల్ల రక్త ప్రసరణ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ద్రవ ప్రవాహం వల్ల కంటి సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రేడియేషన్ ప్రభావం కూడా ఆస్ట్రోనాట్స్పై ఉంటుంది.
అంతరిక్ష కేంద్రం నుంచి డ్రాగన్ క్యాప్సూల్ కొన్ని క్షణాల క్రితం అన్‌డాకింగ్ అయ్యింది. 17 గంటల జర్నీ తర్వాత భూమిపై ఆ క్యాప్సూల్ వాలనున్నది.